Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి ఇష్యూలో కేసీఆర్ గేమ్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:30 PM GMT
ఎర్రబెల్లి ఇష్యూలో కేసీఆర్ గేమ్ ప్లాన్ ఇదేనా?
X
మనసు పడింది సొంతం చేసుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. అనుకున్నది సాధించినప్పుడూ అంతే సంతోషంగా ఉంటుంది. అందులోకి ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి.. చేతికి చిక్కినట్లే చిక్కి.. జారి పోయింది.. ఎట్టకేలకు చేతికి చిక్కితే ఆ మజానే వేరుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాదాపుగా అలాంటి హ్యాపీలో మూడ్ లో ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. పార్టీలోకి చేర్చుకోవాలని భావించిన ఇద్దరు ముఖ్యనేతల్లో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అయితే.. మరొకరు వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ఇద్దరి నేతల సమర్థత.. విధేయత కేసీఆర్ కు తెలియంది కాదు.

అలాంటి ఇద్దరు నేతల్ని పార్టీలోకి తీసుకొస్తే.. పార్టీ పరంగా ఎంతో బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో ప్రయత్నాలు షురూ చేసిన ఆయన.. తుమ్మల మనసును గెలుచుకునే విషయంలో వెంటనే విజయం సాధించినా.. ఎర్రబెల్లి విషయంలో మాత్రం చాలానే ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు.. ఎర్రబెల్లి తనకు తానే సంకేతాలు పంపి మరీ.. కారు ఎక్కుతానని చెబితే కేసీఆర్ లాంటి నేతకు అంతకుమించి కావాల్సిందేముంది?

ఇంతకీ ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకునే విషయంలో కేసీఆర్ ఎందుకంత ఆసక్తి ప్రదర్శించారన్నది ఒక ప్రశ్న అయితే.. తాజాగా పార్టీలోకి ఎర్రబెల్లిని చేర్చుకోవటం ద్వారా ఆయన గేమ్ ప్లాన్ ఏమిటన్నది మరో ప్రశ్న. ఈ విషయంపై పలు కోణాల్లో దృష్టి సారిస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

ఇదేనా గేమ్ ప్లాన్..?

= చాలా అరుదుగా ఉండే ఒక ట్రాక్ రికార్డు ఎర్రబెల్లి సొంతం. పాతికేళ్ల వయసులో పచ్చ కండువా భుజం మీదేసుకున్న ఆయన.. గడిచిన 30 ఏళ్లలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదొక్కటి చాలు.. ఎర్రబెల్లికి ప్రజల్లో ఎంత పట్టు ఉందో చెప్పటానికి. ఇలాంటి ప్రజాదరణ నేత ఎప్పుడైనా ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే.. సొంత జట్టులో సభ్యుడైతే..? ఈ ప్రశ్నకు సమాధానమే.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించటం.

= ఎర్రబెల్లి రాకతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా తయారైనట్లే. ఆ జిల్లాకు చెందిన పలువురు బలమైన నేతలు (కడియం శ్రీహరి.. కొండా సురేఖ లాంటి వాళ్లు) పార్టీలో ఉండటంతో విపక్షం ఆ జిల్లాలో ఎంటర్ అయ్యే అవకాశం ఇకపై లేనట్లే.

= కాస్త సొంతంగా వ్యవహరించే శక్తియుక్తులున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి వాళ్లు భవిష్యత్తులో తోక జాడించే అవకాశం లేకుండా.. ఎర్రబెల్లితో చెక్ పెట్టే అవకాశం ఉండటం.

= ఎర్రబెల్లి రాకతో.. తెలుగుదేశాన్ని నైతికంగా దెబ్బ తీయటంతో పాటు.. మిగిలిన అరొకొర మొత్తంగా పార్టీలోకి వచ్చేయటం ద్వారా.. తెలంగాణలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేయాలన్న ఆలోచన.

= భవిష్యత్తులో మళ్లీ టీడీపీ కొలుకునే అవకాశం లేకుండా చేయటంతో పాటు.. తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే అన్న భావన కలిగించటం.