Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫోక‌స్ అంతా ఆ ఐదు సీట్ల మీద‌నేన‌ట‌!

By:  Tupaki Desk   |   18 Oct 2018 5:07 AM GMT
కేసీఆర్ ఫోక‌స్ అంతా ఆ ఐదు సీట్ల మీద‌నేన‌ట‌!
X
ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి తెలంగాణ‌లో ఎంత‌గా ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కేసీఆర్ పుణ్య‌మా అని ముందే వ‌చ్చిన ఎన్నిక‌ల పండ‌గ వేళ‌.. పార్టీలు.. నేత‌లంతా హ‌డావుడి హ‌డావుడిగా ఉంటున్నారు. వారికి 24 గంట‌లూ స‌రిపోవ‌టం లేదు.

ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా టైమే ఉన్నా.. అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేసే క‌న్నా.. ఎంత ఎక్కువ‌గా అయితే అంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌టం ద్వారా వీలైనంత ఎక్కువ మైలేజీని మూట‌గ‌ట్టుకోవాల‌న్న ప్ర‌య‌త్నంతో కిందా మీదా ప‌డిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితి నేత‌ల్లో క‌నిపిస్తున్న వేళ‌.. మ‌రి.. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఒక్కొక్క‌రు త‌మ నియోజ‌క‌వ‌ర్గం మీద‌న పెట్టే స‌మ‌య‌మే స‌రిపోన‌ప్పుడు.. తెలంగాణ‌లోని మ‌జ్లిస్ పోటీ చేసే ఆ ఏడు సీట్లు మిన‌హాయిస్తే.. మిగిలిన 112 సీట్ల మీద దృష్టిపెట్టాల్సిన కేసీఆర్ ఎంత బిజీగా ఉండి ఉంటారు?

అందులోకి ఆయ‌న 112 సీట్ల‌కు 110 సీట్ల‌లో గెలుస్తామ‌ని.. కావాలంటే రాసి పెట్టుకోవాల‌ని చెప్ప‌టం తెలిసిందే. మొద‌ట్లో అప్ర‌క‌టిత మిత్రుడు బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్థానాల్ని వారికి వ‌దిలేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. వాటిల్లోనూ గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని కేసీఆర్ డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌తిప‌క్షాల‌కు రెండంటే.. రెండు చోట్ల మాత్ర‌మే గెలుస్తార‌న్న మాటను కేసీఆర్ చెబుతున్నారు. అదెంత వ‌ర‌కూ సాధ్య‌మ‌న్న విష‌యం రానున్న రోజుల్లో తేలుతుంద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో తాను ప‌క్కాగా గెలుస్తాన‌ని చెబుతున్న 110 సీట్ల‌లో ఐదు సీట్ల మీద కేసీఆర్ ప్ర‌త్యేకంగా పోక‌స్ చేసిన‌ట్లు చెబుతున్నారు.నిద్ర‌లోనూ ఐదు సీట్ల మీద‌నే కేసీఆర్ ఆలోచ‌న‌ల‌న్ని అని చెబుతున్నారు.

ఏది ఏమైనా స‌రే.. ఐదు సీట్ల‌లో గులాబీ జెండా ఎగ‌రాల‌ని.. ఆ దెబ్బ‌కు తెలంగాణ‌లో తాను తిరుగులేని శ‌క్తిగా మార‌తాన‌ని.. త‌న‌ను మాట అనేందుకు నోరు రాని ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఇదంతా జ‌ర‌గాలంటే తాను కోరుకున్న ఐదు సీట్ల‌లో పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వాల‌న్న క‌సితో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. 112 సీట్ల‌లో 110 సీట్లు గెలుచుడు ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేసే కేసీఆర్ కు ఐదు సీట్లు ఒక లెక్కా అని అనుకోవ‌చ్చు? కానీ.. ఆ ఐదుసీట్లు ఏమిటో చూస్తే.. కేసీఆర్ ఎందుకంత ఫోక‌స్ చేస్తున్నారో అర్థం కాక మాన‌దు.

ఇంత‌కీ.. కేసీఆర్ స్పెష‌ల్ గా టార్గెట్ చేసిన ఆ ఐదు సీట్లు ఏమిటో తెలుసా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బ‌రిలో దిగే హుజురాబాద్‌.. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేసే కొడంగ‌ల్.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌.. త‌న మాట‌ల‌తో కేసీఆర్ పై నిప్పులు చెరిగే డీకే అరుణ బ‌రిలోకి దిగే గ‌ద్వాల‌.. కేసీఆర్ ఓట‌మే త‌న ధ్యేయ‌మ‌ని శ‌ప‌ధం చేసిన కోమ‌టిరెడ్డి రంగంలోకి దిగే న‌ల్గొండ‌.. తెలంగాణ కాంగ్రెస్ పెద్దాయ‌న జానారెడ్డి పోటీకి దిగే నాగార్జున‌సాగ‌ర్ ల మీద ప్ర‌త్యేక‌మైన దృష్టిని సారించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ ఐదు స్థానాల‌పైనా కేసీఆర్ ప్ర‌త్యేక‌మైన దృష్టిని సారించ‌ట‌మే కాదు.. ఈ ఐదుగురు ప్ర‌ముఖుల‌కు వ్య‌తిరేకంగా ఉండే చిన్న‌నాయ‌కుల్ని సైతం త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని మాట్లాడుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మామూలుగా అయితే.. మంత్రుల‌కు సైతం ద‌క్క‌ని కేసీఆర్ ద‌ర్శ‌నం.. చిన్న చిన్న నేత‌ల‌కు సైతం ద‌క్కుతోంద‌ని.. అదంతా ఐదు స్థానాల మ‌హిమ‌గా చెబుతున్నారు. మ‌రి.. కేసీఆర్ అంత‌లా ఫోక‌స్ చేసిన ఆ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జా తీర్పు ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.