ఆ ఐదుగురికి కఠిన పరీక్ష పెట్టిన కేసీఆర్

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

కరీంనగర్ జిల్లా.. గులాబీ దళానికి కంచుకోట.. కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీ పెట్టి తొలి సభ నిర్వహించింది కరీంనగర్ లోనే. ఇక మలి దశ ఉద్యమంలో ఆమరణ దీక్షకు వెళ్లింది కరీంనగర్ నుంచే..   తొలి తెలంగాణ ప్రభుత్వంలో మొదటి పథకాన్ని ప్రారంభించింది కరీంనగర్ లోనే. అలాంటి ప్రతిష్టాత్మక కరీంనగర్ ఎంపీ సీటులో కేసీఆర్ ను వైఎస్ హయాంలో రెండు సార్లు గెలిపించి ఉద్యమానికి క్లిష్ట సమయంలో కరీంనగర్ ప్రజలు గులాబీ బాస్ కు అండగా నిలిచారు.అయితే కాలం మారింది. గులాబీ కంచుకోట కరీంనగర్ ఎంపీ స్తానం బీజేపీ వశమైంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బండి సంజయ్ కరీంనగర్ వెలమల కోటపై కమలం జెండా ఎగురవేసి కరీంనగర్ ఎంపీగా గెలిచారు.  కేసీఆర్ కు షాకిచ్చారు.

అందుకే తనకు సెంటిమెంట్ అయిన కరీంనగర్ లో తిరిగి గులాబీ రెపరెపలు ఆడించేందుకు కేసీఆర్ పట్టుదలగా ఉన్నారట..అందుకే అసమ్మతి ఉన్నా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు ఇవ్వాల్సిన మంత్రి పదవిని అదే కాపు సామాజికవర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగులకు ఇచ్చారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ నే ఢీకొట్టేందుకే ఇలా చేశారన్న గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదుగురికి కీలక పదవులు ఇచ్చి కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు పక్కనే ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ పై కేసీఆర్ గురిపెట్టినట్టు తెలిసింది.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పుడు కేబినెట్ లో ఈటల - కేటీఆర్ - కొప్పుల ఈశ్వర్ - గంగుల కమలాకర్ తోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కీలక పదవిలో కరీంనగర్ ఎంపీగా ఓడిన వినోద్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ - నిజామాబాద్  కంచుకోటలను కాపాడుకొని మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండాను ఎగురవేసే బాధ్యతను ఈ పంచ నేతల చేతుల్లో కేసీఆర్ పెట్టారట.. మంత్రిపదవులు - అధికారం ఇచ్చానని కరీంనగర్ - నిజామాబాద్ లలో కనుక ఓడిపోతే బాగుండదని హెచ్చరికలు పంపారట.. సో ఇప్పుడు నేతలంతా కరీంనగర్ - నిజామాబాద్ కార్పొరేషన్ లలో గెలిచి చూపించేందుకు కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం.