Begin typing your search above and press return to search.

సీఎంగా కేసీఆర్ తొలి ఇంటర్వ్యూ అంట

By:  Tupaki Desk   |   31 May 2016 7:18 AM GMT
సీఎంగా కేసీఆర్ తొలి ఇంటర్వ్యూ అంట
X
తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈనాడు’ దినపత్రిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి భారీ ఇంటర్వ్యూ పబ్లిష్ కావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రమాణాల హద్దుల్ని దాటకుండా.. తనకు తానే లక్షణ గీతలు గీసుకున్నట్లుగా చెప్పే ఈనాడులో కేసీఆర్ ఇంటర్వ్యూకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పేజీలకు పేజీల చొప్పున ఇంటర్వ్యూను ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. మొదటి పేజీలో ‘‘ఈనాడు’’ మాస్టర్ హెడ్ కు పక్కన కేసీఆర్ ఫోటోను అచ్చేయటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.

చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈనాడు మాస్టర్ హెడ్ పక్కకు వార్తాంశాన్ని తీసుకొస్తారే తప్పించి విడిగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించరు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన రాజకీయ ఇంటర్వ్యూ కోసం అంత భారీ ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక.. ఇంటర్వ్యూ పాఠాన్ని అచ్చేసిన విధానం కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు.. మీడియా సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇంత భారీ ఇంటర్వ్యూను ఈనాడు చరిత్రలో ఇంత వరకూ ఇవ్వలేదన్నది కొద్దిమంది చెబుతున్న మాట.

ఇదిలా ఉంటే.. ఈ ఇంటర్వ్యూను ఇంత భారీగా ఎందుకు ఇచ్చారు? ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న ఆసక్తి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. తొలి ఇంటర్వ్యూను తన సొంత మీడియా సంస్థకు ఇవ్వకుండా ఈనాడుకు ఇవ్వటం.. రెండేళ్ల ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లో భారీగా ఉన్న నేపథ్యంలో.. తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన కేసీఆర్ కు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం తప్పు లేదన్న అంచనాతో ఇంత భారీగా ఇంటర్వ్యూను పేజీలకు తరబడి అచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈనాడు కాంపౌండ్ లోనే మరో వాదన కూడా వినిపిస్తోందని చెబుతున్నారు. అరుదైన ఇంటర్వ్యూ అని చెబుతున్నప్పటికీ.. మరేమీ వార్తలు లేనట్లు అన్నేసి పేజీల్లో అచ్చేయటం ఏమిటి? మరీ సిత్రం కాకపోతే అంటూ వాపోతున్నోళ్లు కూడా ఉన్నారట.