Begin typing your search above and press return to search.

ఇక.. గులాబీ మంత్రుల నోట మాటల తూటాలే..

By:  Tupaki Desk   |   22 Oct 2016 6:27 AM GMT
ఇక.. గులాబీ మంత్రుల నోట మాటల తూటాలే..
X
ఇద్దరి పేర్లలో ‘చంద్రుడు’ కామన్ అయినా.. కొన్ని విషయాల్లో ఈ ఇద్దరు చంద్రుళ్ల తీరు భిన్నంగా ఉంటుంది. మరీ.. ముఖ్యంగా మంత్రుల విషయంలో వారి అప్రోచ్ పూర్తి భిన్నమని చెప్పాలి. తాను పరిగెడుతూ.. మంత్రుల్ని పరిగెట్టేసే తత్వం చంద్రబాబుకు అలవాటైతే.. తాను కూల్ గా ఉంటే.. తమ మంత్రులకు అవసరమైనంత స్పేస్ ఇవ్వటం కేసీఆర్ లో ఉన్న క్వాలిటీగా చెప్పాలి.

ఇక.. మంత్రులకు సంబంధించిన అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ తరచూ ఉంటుంది. కేసీఆర్ లో ఆ కోణం కనిపించదు. చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ తన మంత్రులకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తారనే చెప్పాలి. అలాంటి ఆయనకు తాజాగా కోపం వచ్చేసింది. తానెంత స్వేచ్ఛ ఇచ్చినా.. వారు దాన్ని ఉపయోగించుకోకపోవటం.. పార్టీని.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా తెలంగాణ విపక్షాలు వ్యవహరిస్తున్నా పట్టనట్లుగా ఉండటం ఆయనకు ఆగ్రహం కలిగించేలా చేసింది. ఓపక్క ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసే విషయంలో విపక్షాలు రోజురోజుకూ తమ కత్తుల్ని సాన పెడుతుంటే.. మంత్రులు మాత్రం అందుకు భిన్నంగా కూల్ గా ఉండటంపై కేసీఆర్ అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. మంత్రుల తీరును తప్పు పట్టటమే కాదు.. విపక్షాలు విరుచుకుపడుతున్నా.. ఎందుకు కామ్ గా ఉంటున్నారని.. ఎదురుదాడి ఎందుకు చేయటం లేదన్న విషయాన్ని సూటిగా అడిగేశారు. కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి మాటల్ని పెద్దగా వినని మంత్రులు ఒక్కసారి గతుక్కుమన్నట్లుగా సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రచారం చేసే విషయంలోనూ.. విపక్షాలపై విరుచుకుపడే విషయంలో మంత్రుల తీరు ఏ మాత్రం బాగోలేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. అధినేత మనసును దోచుకోవటానికి.. ఆయన్ను శాంతించేలా చేయటం కోసం మంత్రులు ఉగ్రరూపం దాల్చటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తమ ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్న విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సో.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మాటల తూటాలతో మరింత వేడెక్కిపోవటం ఖాయమన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/