Begin typing your search above and press return to search.

వాటి గురించి అడిగితే కేసీఆర్ కు కాలిపోయింది

By:  Tupaki Desk   |   24 Feb 2017 11:54 AM GMT
వాటి గురించి అడిగితే కేసీఆర్ కు కాలిపోయింది
X
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తను సమర్పిస్తున్న మొక్కుల విషయంలో విమర్శలు రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అని ప్రశ్నించారు. దేవుడి మొక్కు విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్‌ రెడ్డి లాంటి వారు దేవుడి మొక్కులపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. అందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని వీరభద్ర స్వామిని మొక్కుకున్నానని కేసీఆర్ గుర్తు చేశారు. శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నానని తెలిపారు.

ప్రజలు కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇస్తే 40 ఏళ్లు ఏమీ చేయలేదని కేసీఆర్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చేస్తుంటే ప్రాజెక్టులకు అడ్డు పడుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. కాంగ్రెస్ నాయకులు ప్రగతి నిరోధకులు కేసీఆర్ మండిపడ్డారు. శాసనసభలో కాంగ్రెస్ నేతల తీరుని ఎండగడుతామని చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ - కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిని స్పష్టమైన ఆధారాలతో అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్ అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు అని కేసీఆర్ దుయ్యబట్టారు. బానిస బతుకులు బతికిన కాంగ్రెస్ నాయకులకు పాలసీ లేదన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది అని ఎండగట్టారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం దొంగల ముఠా తయ్యారయ్యిందన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల దృష్టిలో ప్రజలంటే ఓట్లేనని పేర్కొన్నారు. వారికి ప్రజల కష్టాలు పట్టవు అని కేసీఆర్ చెప్పారు.

కురవి వీరభద్ర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామికి సీఎం కేసీఆర్ బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూ. 62,908 ఖర్చుతో స్వామి వారికి 20.28 గ్రాముల బంగారంతో మీసాలు చేయించారు. పాత వరంగల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు, డోర్నకల్ - మరిపెడ అభివృద్ధికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్‌టైల్స్ పార్కుకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. త్వరలోనే టెక్స్‌టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాను ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పాత వరంగల్ జిల్లాలకు త్వరలోనే రెండు పంటలకు సరిపడా నీరు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో రూ. 36 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు బలమైన అడుగులు వేస్తున్నామని ఉద్ఘాటించారు. రూ. 20 కోట్ల సంపద సృష్టించే దిశగా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ ఏడాది 10-12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందన్నారు. సంచార జాతుల కోసం రూ. వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నాయి బ్రహ్మణులకు ప్రత్యేక ఆత్మగౌరవ హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 30 వేల హైజెనిక్ సెలూన్ల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రజకుల కోసం అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 4 వేల కోట్లతో 88లక్షల గొర్రెలను యాదవులకు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. అభివృద్దిని అడ్డుకుంటున్న వారిపై జర్నలిస్టులు యుద్ధం ప్రకటించాలని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/