Begin typing your search above and press return to search.

కేసీఆర్ మొదలెట్టేశాడు.. కాచుకోండి..

By:  Tupaki Desk   |   20 Nov 2018 10:09 AM GMT
కేసీఆర్ మొదలెట్టేశాడు.. కాచుకోండి..
X
‘‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది..’ ఇదీ రజినీకాంత్ సినిమాలోని ఫేమస్ డైలాగ్.. ఇప్పుడీ డైలాగ్ ను బేస్ చేసుకొని తెలంగాణ ఎన్నికల్లో సెటైర్ల వర్షం కురుస్తోంది. టీఆర్ ఎస్ అనుకూలురు సింహంలా కేసీఆర్ ను పోలుస్తూ ప్రతిపక్షాలను ఏకిపారేసేలా వీడియోలను సోషల్ మీడియాలో వదలుతున్నారు.. కాంగ్రెస్ వాళ్లు కూడా ఇలా కేసీఆర్ ను ఏకీపారేసే వీడియోలను చాలానే సోషల్ మీడియాలో వదులుతున్నారు. కానీ ఇన్నాళ్లు పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరుగా మారింది.

కేసీఆర్... మహాకూటమి అభ్యర్థులను ప్రకటించే వరకూ సైలెంట్ గా ఉన్నాడు. ఎట్టకేలకు కాంగ్రెస్ జాబితా ఎన్నో కోట్లాటలు - అసమ్మతులు - ఆగ్రహా జ్వాలల నడుమ బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పటికే ఏ అభ్యర్థికి ఎలాంటి వ్యూహాలు.. ఏ జిల్లాలో ఎలా ముందుకెళ్లాలో పక్కాగా స్కెచ్ వేసిన కేసీఆర్ ఇప్పుడు తాజాగా మలివిడత ప్రచారంలో దుమ్ము దులిపేస్తున్నాడు. తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ.. ఆధారాలు చూపిస్తూ.. జనాల అర్థమయ్యేలా కూటమి మోసాలను ఎండగడుతున్న తీరు కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది. కేసీఆర్ సభల్లో విమర్శల వాన చూశాక అస్సలు కాంగ్రెస్ - మహాకూటమి పార్టీలకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందంటే కేసీఆర్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు..

తుఫాను ముందు ప్రశాంతత లాగా కేసీఆర్ ఇన్నాళ్ల మౌనం నేటి సభలతో బద్దలవుతోంది. కాంగ్రెస్ మహాకూటమిపై తుఫానులా విరుచుకుపడుతోంది.. ప్రస్తుత ప్రచార శైలి గమనిస్తే కేసీఆర్ ను కొట్టేవాడు తెలంగాణలో లేడని రాజకీయ విశ్లేషకులు ఘంఠాపథంగా చెబుతున్నారు... ఒక్కసారిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం కేసీఆర్ తన ప్రచారంతో మైండ్ గేమ్ తో టీఆర్ ఎస్ కు అనుకూలంగా మారుస్తున్నాడంటున్నారు.. మహాకూటమి అంతా ఏకమైనా సరే.. కేసీఆర్ గేమ్ ఛేజింగ్ వ్యూహాలు - ప్రచారం ముందుకు ప్రతిపక్షాలన్నీ తేలిపోతుండడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

కేసీఆర్ నిన్నటి ఖమ్మం సభలో ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం హోదాలో ఖమ్మంకు జీవనాధారమైన సీతారామా ప్రాజెక్ట్ ఆపాలాంటూ కేంద్రానికి రాసిన లేఖను బయటపెట్టడం మహాకూటమిని తీవ్రంగా ఇరుకునపెట్టింది. ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇయ్యనియ్యకుండా చేస్తున్న టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో నిలదీయాలని కేసీఆర్ చేసిన ప్రచారానికి జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీడీపీ దీనిపై కనీసం మాట కూడా మాట్లాడే ధైర్యం లేకుండా కేసీఆర్ ఇరికించేయడం ఆయన ప్రచార శైలికి - ప్రత్యర్థులకు అందని ఆయన దూకుడుకు అర్థం పడుతోంది. కేటీఆర్ కూడా మినీ ఆశీర్వాద సభలతో దద్దరిల్లిపోయేలా చేస్తున్న ప్రచారం కూడా టీఆర్ ఎస్ భారీ మైలేజ్ తెచ్చిపెడుతోంది.

ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఇన్నాళ్లు మహాకూటమికి దక్కిన ఊపును ఇప్పుడు కేసీఆర్ తన ప్రచారంతో లేకుండా చేస్తున్నాడు. తనదైన విమర్శలు - చంద్రబాబు తెలంగాణపై చేసిన కుట్రలకు ఆధారాలు చూపుతూ ప్రచార వ్యూహంతో కాంగ్రెస్ కూటమిని డిఫెన్స్ లోకి నెడుతున్నారు. కేసీఆర్ తీరు ప్రతిపక్షాలను షేక్ చేస్తోంది.

కేసీఆర్ పకడ్బందీగా ప్రచార వ్యూహం రచించాడు. జిల్లాలకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని మారుస్తున్నాడు. ఖమ్మంలో టీడీపీ చంద్రబాబు చేసిన మోసం.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టాడు. వరంగల్ లో దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. ఇక సిద్దిపేటలో తాజాగా కాంగ్రెస్ వల్ల నీళ్లు రాని వైనం.. తమ పాలనలో వచ్చిన గోదావరి నీళ్లను చూపించి జనాలను మెప్పించాడు. ఇలా జిల్లాల వారిగా అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు చేయనివి.. తాము చేసినవి చెబుతూ తెలంగాణ ప్రచారంలో వార్ వన్ సైడ్ గా కేసీఆర్ మార్చేస్తున్నారు.

కేసీఆర్ ప్రచారం శైలి చూసి టీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోతున్నారు. సింహం సింగిల్ గానే వచ్చిందని.. గర్జించడం మొదలుపెట్టిందని.. ఒక్కొక్కటి కూటమి తప్పులను బయటకు తీస్తోందని.. ఈ దెబ్బకు కాంగ్రెస్ కూటమి కుదేలై.. టీఆర్ఎస్ ఈజీగా గెలవడం ఖాయమని ఘంటా పథంగా చెబుతున్నారు.. ప్రస్తుతం సమకాలీన తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ ను మించి మంచి వక్త లేడని.. ప్రతిపక్ష నేతలు - ఏపీ నేతల్లో కూడా కేసీఆర్ లా మాటల తూఠాలు పేల్చగల వారు లేరనడంలో సందేహం లేదంటున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తున్న స్పందన చూశాక ఇన్నాళ్లు గులాబీ పార్టీపై వచ్చిన విమర్శలు కూడా చెదిరిపోయాయని నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ - కేటీఆర్ ఇద్దరూ చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా టీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తుందన్న నమ్మకాన్ని గులాబీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో..