Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్యామిలీ సమర్పించు ‘‘తెలంగాణ టుడే’’?

By:  Tupaki Desk   |   27 May 2016 4:38 AM GMT
కేసీఆర్ ఫ్యామిలీ సమర్పించు ‘‘తెలంగాణ టుడే’’?
X
రాజకీయ నేతలు దూరదృష్టితో వ్యవహరిస్తుంటారు. ఇది వారికి చాలా అవసరం. అయితే.. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి కంటే వంద రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు. కాలం కలిసి రాని సమయంలో కామ్ గా ఉంటూ.. తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశంపై కసరత్తు చేసే ఆయన.. ఒక్కసారి పట్టు చిక్కితే ఎంతలా చెలరేగిపోతారన్నది గత రెండేళ్లుగా చూస్తున్నదే.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. రాజకీయం అంటే పార్టీ నడపటం.. మరింత బలోపేతం చేయటం లాంటి అంశాల మీదనే కాక.. తన బలాన్ని మిగిలిన రంగాల్లోకి విస్తరించే విషయం మీద ఆయన ప్రత్యేక ఫోకస్ చేస్తుంటారు. ఉద్యమ సమయంలో తన వాణిని వినిపించేందుకు సొంతంగా మీడియా సంస్థను షురూ చేసిన ఆయన..అనుకున్నట్లే తన వాదనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. మొదట టీవీ ఛానల్ తో షురూ అయిన ఆయనకు చెందిన మీడియా సంస్థ తర్వాతి కాలంలో దినపత్రికను స్టార్ట్ చేయటం తెలిసిందే.

తన టీవీ ఛానల్ ను ప్రమోట్ చేసే విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెబుతారు. తన టీవీ ఛానల్ ను ప్రారంభించిన తర్వాత.. మీడియా సంస్థలకు ప్రాణాధారమైన యాడ్ రెవెన్యూ కోసం వారు లేవనెత్తిన వాదన మిగిలిన వారి నోరు తెరవకుండా చేసిందని వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. తన ఛానల్ షురూ చేసిన వెంటనే.. సీమాంధ్ర మీడియా సంస్థలకు ఇచ్చే ప్రకటనల వాటా ఎంత? తెలంగాణ మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల వాటా ఎంత? అంటూ సంబంధం లేని అంశాల్ని లింకు పెడుతూ తెర మీదకు తీసుకొచ్చిన వాదన పుణ్యమా అని.. ఆర్థికంగా చాలా త్వరగా కుదురుకుందని చెబుతుంటారు.

ఈ కారణంతోనే.. ఇప్పటి రోజుల్లో చాలా కష్టమని చెప్పే దినపత్రికను స్టార్ట్ చేయటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ.. సంస్థ ఆర్థికంగా నిలదొక్కునేలా చేయగలిగినట్లుగా చెబుతున్నారు. తమకు సంబంధించిన అంశాల్ని.. తమ వాదనను మిగిలిన మీడియా సంస్థలు చెప్పినా.. చెప్పకున్నా తమ గొంతు బలంగా వినిపించేందుకు వీలుగా టీవీ ఛానల్.. తెలుగు న్యూస్ పేపర్ పెట్టిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఇంగ్లిషు దినపత్రికను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కేసీఆర్ కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయటంతో పాటు.. తమకు చెందిన మీడియా సంస్థల్ని మరింత బలోపేతం చేయటంలో భాగంగా ఇంగ్లిషులో దినపత్రికను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి అయ్యిందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఇంగ్లిషు దినపత్రికను.. ‘‘తెలంగాణ టుడే’’ అన్న పేరుతో వస్తుందన్న మాట చెబుతున్నారు. ఈ పేరును ఇప్పటికే రిజిష్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పేరుతో రిజిష్టర్ అయిన దినపత్రిక కేసీఆర్ ఫ్యామిలీదా? కాదా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కేసీఆర్ ఫ్యామిలీదేనని చెబుతున్నారు. తమకు చెందిన మీడియా సంస్థల్లో ఇంగ్లిషులో లేదన్న కొరత కేసీఆర్ త్వరలో తీర్చుకోనున్నట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది.