Begin typing your search above and press return to search.

బాబులానే కేసీఆర్ ను తిడుతున్నారే..

By:  Tupaki Desk   |   26 Feb 2017 6:00 AM GMT
బాబులానే కేసీఆర్ ను తిడుతున్నారే..
X
ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం ఇన్ స్టెంట్ గా ఉండే అతి కొద్దిమంది అధినేతల్లో తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ ఒకరు. అడ్డదిడ్డమైన వాదనను సైతం క్రమపద్ధతిలో వినిపించే తీరు కేసీఆర్ లో కనిపిస్తుంది. ఆయనలో ఉన్న ఆ ఆర్ట్ ను డీకోడ్ చేసి.. దెబ్బేసేలా మాట్లాడే వైనం ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లుగా.. ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాలనకు దగ్గర పడుతున్న వేళ.. కేసీఆర్ ను ఇరుకున పెట్టే కొన్నిప్రశ్నలు ఇప్పుడు ఆయన్ను సంధిస్తున్నారు.

గతంలో ఏదైనా అంశంలో ప్రత్యర్థులు విమర్శలు చేసిన వెంటనే.. రిటార్ట్ ఇచ్చేలా మాట్లాడే కేసీఆర్.. కొన్ని విషయాల మీద మాత్రం పెదవి విప్పటం లేదనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే.. పలు దేవాలయాలకు మొక్కులు చెల్లిస్తానన్నది కేవలం కేసీఆర్ పర్సనల్ నమ్మకంతో మొక్కిన మొక్కులుగా చెప్పాలి. మరి.. వ్యక్తిగతంలో మొక్కిన మొక్కుల్ని.. రాష్ట్రప్రజలు పన్నులు చెల్లించిన మొత్తంతో ఎలా తీరుస్తారన్నది ధర్మ సందేహమే. చేతిలో పవర్ అనే మంత్రదండం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ వైఖరిని ఇప్పుడు పలువురు తప్పు పడుతున్నారు.

ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నల పరంపరను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అందిపుచ్చుకోవటమే కాదు.. ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మొక్కులు మొక్కిన కేసీఆర్.. తెలంగాణను తన సొంత జాగీరు మాదిరి భావిస్తున్నట్లుగా ఉందని మండిపడుతున్నారు. మొక్కుల విషయంలో విపక్షాలు చేస్తున్న వాదనకు కేసీఆర్ అండ్ కో దగ్గర సరైన కౌంటర్ లేదనే చెప్పాలి. అయినా.. నిత్యంనీతులు చెప్పే కేసీఆర్ లాంటి నేత.. తన మొక్కులకు తన డబ్బుల్నే ఎందుకు ఖర్చు చేయనట్లు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం చెప్పింది లేదు.

ఇది చాలదన్నట్లుగా వాస్తుకారణంగా కట్టించుకున్న కొత్త ఇంటి నిర్మాణంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. రూ.50కోట్ల వరకూ ఖర్చు అయినట్లుగా కొందరు చెబుతుంటే.. మరికొందరు ఈ ఇంటి కోసంరూ.70 నుంచి రూ.100కోట్ల వరకూ ఖర్చు అయినట్లుగా లెక్కలు చెబుతున్నారు. వీటికి తోడు.. కార్లను మార్చేయటం.. కొత్త కార్ల కోసం భారీగా నిధులు తగలేశారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు విమానాల్ని వినియోగిస్తున్న తీరుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తీరు చూస్తే.. చంద్రబాబును తలపించేలా ఉందన్న మాట కొందరు నేతల నోట వినిపిస్తోంది. అదే పనిగా అనవసరమైన ఖర్చులు చేసే సీఎంగా చంద్రబాబుకున్న ఇమేజ్.. ఇప్పుడు కేసీఆర్ కు కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఖర్చుల విషయంలో.. ఆడంబరాల విషయంలో కేసీఆర్ కాస్త తగ్గితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/