Begin typing your search above and press return to search.

వారసత్వ సంపద అక్కర్లేదా కేసీఆర్?

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:43 AM GMT
వారసత్వ సంపద అక్కర్లేదా కేసీఆర్?
X
కేసీఆర్ ను మేధావిగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఆయనతో కూర్చొని పది నిమిషాలు మాట్లాడితే చాలు.. అబ్బ.. ఎంత నాల్డెజో అని మురిసిపోవాల్సిందే. కేవలం తన తెలివితేటలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నమాటను కాదనలేం. పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి.. ఏళ్లకు ఏళ్లు పోరాడి.. అవమానాలకు గురై.. చివరకు తాను అనుకున్నది సాధించిన కేసీఆర్ ను ఎంతమంది పొగిడేస్తారో.. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాల్ని తప్పు పడుతూ అంతేమంది తిట్టేసే పరిస్థితి.

కష్టాల కొలిమిగా అభివర్ణించే తెలంగాణ జనుల జీవితాల్ని తన పాలనలో ఆ ఇబ్బందులు తొలిగిపోయేలా నిర్ణయాలు తీసుకొని.. తెలంగాణ ప్రాంతీయుల జీవితాల్ని బాగు చేయాల్సి ఉన్నా.. కేసీఆర్ వాటి కంటే కూడా కొత్త కొత్త భవనాలు నిర్మించే ముచ్చటను ప్రదర్శించటం కనిపిస్తోంది. ఓపక్క ఏపీలో నిలువ నీడ లేక.. అవసరం కోసం భారీగా ఖర్చు చేస్తూ బిల్డింగ్ లు కట్టుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలో మాత్రం.. సౌకర్యవంతంగా ఉన్నా కూడా.. విశాలంగా ఉండేందుకు కొత్త కొత్త భవనాల్ని నిర్మించాలని అనుకోవటం గమనార్హం.

సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించే అంశంపై జోరుగా పని చేస్తున్న తెలంగాణ సర్కారు.. ఈ ఉదంతంపై విపక్షాలు చేసే విమర్శల్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఈ అంశం ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా అసెంబ్లీ.. శాసన మండలి భవనాల్ని కొత్త నిర్మించాలని నిర్ణయించటంతో పాటు.. చారిత్రక భవనాన్నికూల్చేయాలని నిర్ణయించటం విశేషం. దాదాపు 146 ఏళ్ల కిందట నిర్మించిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ను కొత్త అసెంబ్లీ కోసం కూలగొట్టాలని నిర్ణయించటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి వారసత్వ జాబితాలో ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్ ను ఆ జాబితా నుంచి తొలగించి.. అనంతరం ఈ భవనాన్ని కూలగొట్టి.. కొత్త భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ తపిస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా కూలగొట్టాలని భావిస్తున్న ఎర్రమంజిల్ ప్యాలెస్ కు ఘనమైన వారసత్వ చరిత్ర ఉంది. నిజానికి ఇలాంటి కట్టడాల్ని అపురూపంగా దాచుకోవాల్సి ఉంది. చరిత్ర గురించి.. దాని గొప్పతనం గురించి తరచూ లెక్చర్లు ఇచ్చే కేసీఆరే.. చారిత్రక కట్టడాల్ని కూల్చేయాలన్న ఆలోచన చేయటానికి మించిన దురదృష్టకరం ఇంకోటి ఉండదని చెప్పక తప్పదు. ఇదొక్కటే కాదు.. చారిత్రక సంపదను కూల్చేయాలని భావించటం కేసీఆర్ కు కొత్తేం కాదు. గతంలో అసెంబ్లీ.. శాసనమండలి.. సముదాయం కోసం ఎర్రగడ్డలో ఏర్పాటు చేయాలనుకోవటం.. చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేసి కొత్తది కట్టాలన్న ఆలోచనతో పాటు.. రవీంద్ర భారతిని నేలమట్టం చేసి కొత్తగా మరో భవనాన్ని నిర్మించాలని గతంలో నిర్ణయించటం.. దానిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఎర్రమంజిల్ ప్యాలెస్ ను కూల్చేయాలన్నఆలోచనను కేసీఆర్ చేయటం గమనార్హం. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని తపిస్తున్న కేసీఆర్ జోరుకు మరో చారిత్రక కట్టటం బలి కాక తప్పదా? అన్నది ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కేసీఆర్ పేరు వినిపిస్తే చాలు.. చారిత్రక భవనాలు వణికిపోతాయేమో..?