Begin typing your search above and press return to search.

అకున్ పిల్లల భద్రతపై కేసీఆర్ ఆరా!

By:  Tupaki Desk   |   22 July 2017 6:04 PM GMT
అకున్ పిల్లల భద్రతపై కేసీఆర్ ఆరా!
X
డ్రగ్స్ కేసులో లోతుగా, కూసాలు కదిలేలా సాగుతున్న విచారణ సృష్టిస్తున్న ప్రకంపనాలు అన్నీ యిన్నీ కావు. ఈ కేసులో ఇప్పుడు సినిమా సెలబ్రిటీలను విచారించడం ఒక్కటే పబ్లిక్ కు బాగా ఎక్స్ పోజ్ అవుతున్నది గానీ.. నిజానికి ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులపై ఎక్సయిజ్ విచారణాధికారులు కన్నేసి ఉన్నారనేది సమాచారం. ఈ నేపథ్యంలో విచారణకు సారథ్యం వహిస్తున్న అకున్ సభర్వాల్ కు- డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. నీ పిల్లలకు కీడు తలపెడతాం అనే హెచ్చరిక తో ఈ ఫోన్ కాల్స్ రావడంతో.. అకున్ సభర్వాల్ పిల్లలు, వారి భద్రత గురించి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారని కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అకున్ సభర్వాల్ కు సుమారు నాలుగు రోజుల కిందట మూడు వరుస ఫోన్ కాల్స్ వచ్చాయి. అన్ని కాల్స్ సారాంశం ఒక్కటే. అకున్ సభర్వాల్ ను బెదిరించి, భయపెట్టి కేసు విచారణ ముందుకు సాగకుండా ఆపు చేయించడమే. అంతా సినిమా ఫక్కీలో జరిగింది. ‘‘నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు.. ముందు ముందు ఇబ్బందులు పడతావ్’’ అంటూ ఆఫ్రికన్ యాసలో హెచ్చరికలు చేశారు. ఈ ఫోన్ కాల్స్ ఇంటర్నెట్ ద్వారా వచ్చిన కాల్స్ గా గుర్తించారు గానీ.. ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

ఈ నేపథ్యంలో అకున్ సభర్వాల్ కు వచ్చిన బెదిరింపుల గురించి మీడియాలో రావడంతో.. సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయనకు భద్రత పెంచబోతున్నట్లు తెలంగాణ డీజీపీ కూడా ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ , వారి పిల్లల భద్రత గురించి ఆరా తీసినట్లు, అవసరమైతే పిల్లలకు కూడా భద్రత కల్పించాల్సిందిగా, వారు చదివి పాఠశాల భద్రత కూడా చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లుగా చెప్పుకుంటున్నారు. అకున్ సభర్వాల్ భార్య స్మితా సభర్వాల్ ఐఏఎస్ అధికారి. ముఖ్యమంత్రి పేషీలోనే విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో మెదక్ కలెక్టరుగా అత్యుత్తమ సేవలందించిన ఆమె.. తన నిజాయితీతో సీఎం పేషీలోకి వచ్చారు. సభర్వాల్ దంపతులు ఇద్దరూ ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్ గా తెలాంణ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. వీరి పిల్ల గురించి హెచ్చరిక వచ్చిందనగానే... కేసీఆర్ శ్రద్ధ పెట్టినట్టు సమాచారం.