Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల ఒక‌లా.. వాస్త‌వం మ‌రోలా..!

By:  Tupaki Desk   |   15 Jan 2018 5:37 AM GMT
కేసీఆర్ క‌ల ఒక‌లా.. వాస్త‌వం మ‌రోలా..!
X
ముఖ్య‌మైన విష‌యాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టంంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఒక ఇష్యూ అయిపోయిన వెంట‌నే మ‌రో అంశాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. దానికి భారీ ప్ర‌చారాన్ని క‌ల్పించ‌టం.. ఆయ‌న‌కు అడుగుల‌కు మ‌డుగులు ఒత్తే మీడియా సైతం ఆ విష‌యాల‌కు భారీ ప్రాధాన్య‌త‌.. ప్రాముఖ్య‌త ఇవ్వ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది.

పాల‌న‌కు సంబంధించిన అంశాల్ని రివ్యూ చేయ‌టం మీడియా సంస్థ‌లు దాదాపుగా మ‌ర్చిపోయాయా? అన్న‌ట్లుగా ఉంది వ్య‌వ‌హారం. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో వివిధ మంత్రిత్వ శాఖ‌ల్ని ముఖ్య‌మంత్రి ఎన్నిసార్లు రివ్యూ చేశారో తెలిస్తే.. కేసీఆర్ పాల‌న ఎంచ‌క్క‌గా సాగుతుందో అర్థ‌మ‌వుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు తాత్కాలిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించేలా ఏదో ఒక కాన్సెప్ట్ ను తెర మీద‌కు తీసుకురావ‌టం.. హ‌డావుడి చేయ‌టం క‌నిపిస్తుంది. రెండున్న‌రేళ్ల క్రితం మిష‌న్ భ‌గీర‌ధ అంశానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వ‌ట‌మే కాదు.. 2019 నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క ఇంటికి కుళాయి క‌నెక్ష‌న్ ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే తాము సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని.. ఒక‌వేళ‌.. అంద‌రికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వ‌కుండా తాను ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌మ‌ని కూడా అడ‌గ‌న‌ని బీరాలు ప‌లికారు.
కానీ.. తాను చెప్పిన విష‌యం వ‌ర్క్ వుట్ కాద‌ని.. అచ‌ర‌ణ‌లో ఉన్న ప‌లు స‌మ‌స్య‌ల కార‌ణంగా తెలంగాణ వ్యాప్తంగా 2029 నాటికి ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వ‌టం అసాధ్య‌మ‌న్్న విష‌యం అర్థ‌మైన వెంట‌నే.. ఇప్పుడా విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే మానేశారు కేసీఆర్‌. దీనికి బ‌దులుగా వివిధ కుల‌వృత్తుల వారికి తాయిలాలు ప్ర‌క‌టిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌కు కూడా ఏదో ఒక కార్య‌క్ర‌మంలో ఎంగేజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న వైనం చూస్తే.. ఎవ‌రిని కేసీఆర్ ఖాళీగా ఉంచ‌టం లేద‌న్నది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని షురూ చేసిన‌ప్పుడు.. ఇంకేముంది.. గొర్రెల పెంప‌కంలో తెలంగాణ‌నే ముందు ఉండాల‌ని.. వేలాది కోట్లు సంపాదించే మార్గాన్ని కనిపెట్టేసిన‌ట్లుగా హ‌డావుడి చేశారు. వాస్త‌వంగా చూస్తే.. గొర్రెల కొనుగోళ్ల‌లో భారీ అవినీతి జ‌రిగింది ఒక‌టైతే.. గొర్రెలు లేకుండానే గొర్రెల్ని పంపిణీ చేసిన లెక్క‌ల్ని రాసేసిన ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ వ‌రాల‌కు అంతే ఉండ‌ద‌ని చెబుతారు. భోళా శంక‌రుడి మాదిరి అడిగినోళ్ల‌కే కాదు.. అడ‌గ‌నోళ్ల‌కు సైతం త‌న వ‌రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఆయ‌న ఇచ్చిన వ‌రాల‌న్నింటిని వ‌దిలేసి.. కులాల వారీగా ఆయ‌న భ‌వ‌నాల్ని ఏర్పాటు చేస్తాన‌న్న ప్రామిస్ చేయ‌టం తెలిసిందే. అందులో ఒక్క భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేశారా? అన్న‌ది చూస్తే.. కేసీఆర్ మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎంతో ఇట్టే తెలుస్తుంది.

మిగిలిన వారిని వ‌దిలేద్దాం. జ‌గ‌మెరిగిన జ‌ర్న‌లిస్ట్‌ల‌ను సైతం త‌న మాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేయ‌టం కేసీఆర్‌కే సాధ్య‌మ‌వుతుంది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర్న‌లిస్టుల‌ను హ‌డావుడిగా త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని.. వారికి ట్రిపుల్ బెడ్రూం ఇవ్వాల‌న్న త‌న ఆలోచ‌న చెప్ప‌ట‌మే కాదు.. వెను వెంట‌నే ఆ సంగ‌తి చూడాల‌ని.. జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాల‌ని తాను భావిస్తున్నాన‌ని.. ఏడాది తిర‌క్కుండానే వారికి ఇళ్ల‌ను కేటాయిస్తాన‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి మాట ఇప్పుడు ఏమైంద‌న్న‌ది చూస్తే.. మాట ఇచ్చి నెలల మీద నెల‌లు గ‌డుస్తున్నా.. ట్రిపుల్ బెడ్రూం ఇళ్ల ప్ర‌తిపాద‌న‌ సైతం ఒక కొలిక్కి రాలేద‌ని చెబుతారు.

గ‌డిచిన కొద్ది రోజులుగా రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా ముచ్చ‌టే చూద్దాం. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి పేప‌ర్ల‌లో జోరుగా ప్ర‌చారం చేసుకుంటున్న ఈ ప‌థ‌కంపై సాక్ష్యాత్తు టీఆర్ఎస్ నేత‌లే.. 24 గంట‌లు అక్క‌ర్లేదు.. ప్ర‌స్తుతానికి 9 గంట‌ల పాటు క‌రెంటు ఇస్తే స‌రిపోతుంద‌న్న మాట చెప్ప‌టం చూస్తే.. ప‌థ‌కం హిట్టా.. ప‌ట్టా అన్న‌ది తేలిపోతుంది. అంతేనా.. విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌న్న విప‌క్షాల ఆరోప‌ణ‌లు చూస్తే.. నాన్ స్టాప్ విద్యుత్ వెనుక అస‌లు క‌థ చాలానే ఉంద‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. మొయిన్ స్ట్రీమ్ మీడియా .. కేసీఆర్ స‌ర్కారుకు చెక్క‌భ‌జ‌న చేయ‌టంలో బిజీగా ఉండ‌టంతో అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. వ‌చ్చిన కొన్నింటిపైనా ప్ర‌జ‌ల దృష్టి ప‌డ‌కుండా ఏం చేయాలో కేసీఆర్‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. దీంతో.. కేసీఆర్ క‌ల‌ల చ‌ట్రంలో తెలంగాణ ప్ర‌జ‌లు చిక్కుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌ల‌లు క‌ళ్లు తెరిచిన క్ష‌ణంలోనే క‌రిగిపోతాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.