Begin typing your search above and press return to search.

అద్గది.. కేసీఆర్ అంటే..?

By:  Tupaki Desk   |   28 July 2015 4:41 AM GMT
అద్గది.. కేసీఆర్ అంటే..?
X
టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తానేంటో మరోసారి తెలిసేలా చేశారు. ఆయనకు అగ్రహం కలగకుండా ఒత్తిడి తీసుకొచ్చి.. కూసిన్ని వరాలు ఇవ్వమంటే.. భోళా శంకరుడి మాదిరి వరాలు ఇచ్చేసే ఆయన.. సవాలు విసిరిన వారి విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తాజా ఉదంతమే నిదర్శనం.

తమ డిమాండ్ల సాధన కోసం పలు రంగాలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేయటం.. తాము చేసిన డిమాండ్లకు తగ్గ వరాల్ని పొంది.. సమ్మెను విరమించటం చేశారు. కానీ.. గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల జరిపిన సమ్మె.. కేసీఆర్ ను హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వామపక్షాల నేతృత్వంలో సాగిన సమ్మె.. కేసీఆర్ కు ఎంత అగ్రహాన్ని కలిగించిందో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

తాజాగా జీహెచ్ఎంసీలో ఉద్యోగుల్ని కుదించే నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్. ప్రస్తుతం అవసరానికి మించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని.. పైరవీలకు లొంగి.. అడ్డదిడ్డంగా ఉద్యోగాలు ఇచ్చేశారని.. గ్రేటర్ కు 975 మంది డ్రైవర్లు ఉన్నారని.. అంతమంది అవసరం లేదన్న ఆయన.. కోత పెడుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాను అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పే ఆయన.. ఉన్న ఉద్యోగాలు కత్తిరించే పని పెట్టుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె సందర్భంగా ఉద్యోగుల ప్రదాన డిమాండ్ అయిన జీతాల పెంపుపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ఆయన.. తాజాగా ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం చేసుకోవటంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వామపక్షాల నేతృత్వంలో సాగిన సమ్మె లాంటివి భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఉండేలా ఆయన తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. సవాలు విసిరే వారి సంగతి చూసే వరకూ వదిలిపెట్టని కేసీఆర్..తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయటాన్ని సవాలుగా భావించి చిరుద్యోగులకు తానేంటో చూపించాలనుకునే తీరును పలువురు విమర్శిస్తున్నారు.