Begin typing your search above and press return to search.

జడ్జిల ఊహకే అందని పని కేసీఆర్ చేశారా?

By:  Tupaki Desk   |   30 July 2015 5:23 AM GMT
జడ్జిల ఊహకే అందని పని కేసీఆర్ చేశారా?
X
తెలుగు రాజకీయాల్లో ఒక చిత్రమైన అంశం కనిపిస్తుంది. దేశంలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఉండే ఛాన్స్ లేదు. తాము తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ నేతల్ని సైతం.. తెలుగు ప్రజలు విపరీతంగా అభిమానిస్తుంటారు. నిజానికి ఇలాంటి వైరుధ్యం మరెక్కడా కనిపించదేమో.

ఒక రాజకీయ పార్టీని.. రాజకీయ పార్టీ అధినేతను అబిమానిస్తున్నామంటే.. వారిని తప్ప మిగిలిన వారిని సైద్ధాంతికంగా విభేధించటం.. వ్యతిరేకించటం కామన్. కానీ.. కొందరు అందుకు మినహాయింపు ఉందని.. సమకాలీన రాజకీయాల్లో ఇద్దరు నాయకులు నిరూపించారు. వారిలో ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే.. మరొకరు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

వీరిద్దరి విషయంలో పోలికలు పెద్దగా లేకున్నా.. ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ కలుస్తారు. అదేమంటే.. వైఎస్ ను.. కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే వారు (సైద్ధాంతికంగా) కొన్ని కోణాల్లోవారిని అంతే రేంజ్ లో అభిమానిస్తుంటారు. వ్యతిరేకించే వారి మనసుల్ని దోచుకోవటం వీరిద్దరికి మాత్రమే సాధ్యమైందని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. వారి వ్యవహారశైలే అందుకు కారణంగా చెప్పొచ్చు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ అవినీతి తలుపుల్ని బార్లా తెరిసింది వైఎస్సే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అని ప్రతిఒక్కరూ అంగీకరిస్తారు. కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. కొన్ని అంశాల్లో వ్యవహరించే తీరు ఎవరి ఊహకు అందనిదిగా ఉండటమే కాదు.. ఆయన్ను వ్యతిరేకించే వారిని సైతం ఆకర్షించేలా ఉంటుంది.

కేసీఆర్ తరహా కూడా ఇలానే ఉంటుంది. ఆయన్నురాజకీయంగా విపరీతంగా వ్యతిరేకించే వారు సైతం.. వ్యక్తిగతంగా మాత్రం ఆయన్ను విపరీతంగా అభిమానిస్తుంటారు. ఆయన నాయకత్వ లక్షణాలు.. వ్యూహ రచన.. ఏదైనా అంశంపై సాధికారితతో మాట్లాడటం.. ఊహించని విధంగా స్పందించే తీరు కేసీఆర్ అంటే ఆకట్టుకునేలా చేస్తాయి. ప్రత్యూష విషయంలో కేసీఆర్ తీరు ఇలానే ఉంటుంది.

కన్నతండ్రి.. సవతి తల్లి చేతుల్లో చిత్ర హింసలు పడిన ఒక బాధితురాలిని పరామర్శించటం ఇప్పటి రాజకీయాల్లో మామూలే. కానీ.. మా ఇంటికి తీసుకెళ్తా.. మా ఇంట్లో నా కూతురి మాదిరే చూసుకుంటా అని భార్యను.. కూతుర్ని వెంట బెట్టుకొని వచ్చి మరీ మాట ఇవ్వటం.. మాటకేపరిమితం కాకుండా.. బుధవారం డిశ్చర్జ్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి.. తన వ్యక్తిగత నెంబర్లు ఇచ్చి.. బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయించి.. ఎవరు..? ఏ నేత ఇంత జాగ్రత్తగా చూసుకుంటారు.

అందుకేనేమో.. ప్రత్యూషను తాజాగా విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన తీసుకురావటమే కాదు.. కష్టంలో ఉన్న వారిని పరామర్శించిన తీరును అభినందించటమే కాదు.. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా వెళ్లి పరామర్శిస్తారన్నది తమ ఊహాకు కూడా అందని విషయంగా వారు వ్యాఖ్యానించటం గమనార్హం. ఇలా ఊహాకు అందని పనులు చేసి.. విస్మయానికి గురి చేయటమే కాదు.. తనను వ్యతిరేకించే వారి మనసుల్ని దోచుకోవటం వైఎస్.. కేసీఆర్ లకే సాధ్యం.