Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పినట్లు చేయకే చంద్రబాబు ఎల్లకిలాబడ్డాడట!

By:  Tupaki Desk   |   16 Sep 2019 7:30 AM GMT
కేసీఆర్ చెప్పినట్లు చేయకే చంద్రబాబు ఎల్లకిలాబడ్డాడట!
X
మేధావి కేసీఆర్ లో ఉన్న మంచి గుణం ఏమంటే.. తనకు తెలిసిన విషయాల్ని ఆయన అస్సలు దాచి పెట్టరు. తనకున్న విషయ పరిజ్ఞానాన్ని అందరిని పంచే చేస్తారు. అందుకే.. తాను కలిసిన ప్రతి ఒక్కరికి సలహాలు.. సూచనలు ఇచ్చేస్తుంటారు. అదే కేసీఆర్ కు ఎవరైనా సలహాలు.. సూచనలు చేస్తే ఒళ్లు మండుతుంది. ఇక.. తనను తిట్టే వాళ్లు.. విమర్శించేటోళ్లు.. వేలెత్తి చూపించేటోళ్లంతా తెలంగాణవాళ్లు తప్పించి మరెవరూ ఉండకూడదని కోరుకుంటారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతీయులు తిట్టినా భరించలేకపోవటం వేరే విషయమనుకోండి.

తాను కలిసి వారికి సలహాలు ఇచ్చే ధోరణి కేసీఆర్ కు కొత్తేం కాదు. చివరకు ప్రధాని మోడీని కలిసినప్పడు కూడా ఆయనేం చేయాలో తాను సలహాలు ఇచ్చినట్లుగా కేసీఆరే స్వయంగా చెప్పుకున్నారు. కాకుంటే.. చంద్రబాబు మాటలు కామెడీ చేసినంతగా సారు మాటల్ని కామెడీ చేయటం కష్టం కావటంతో ఆ మాటలు అంతగా వైరల్ కాలేదు. ఇప్పుడుఇదంతా ఎందుకంటే.. ఏపీ రాజధానిగా అమరావతి వద్దని.. అది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అని ఆయన వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఇదే సలహాను తాను చంద్రబాబుకు చెప్పినట్లుగా వెల్లడించారు.

అప్పట్లో అమరావతి వాస్తు అద్భుతంగా ఉందని.. ఒక చక్కటి రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు అమరావతికి ఉన్నాయంటూ అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్లుగా పేపర్లలో వచ్చాయి. మరి.. ఆ మాటలు కేసీఆర్ అన్నారో లేదో కానీ.. తాజాగా మాత్రం అసెంబ్లీలో ఆన్ రికార్డుగా.. అమరావతి వేస్ట్ ప్రాజెక్టుగా తేల్చేశారు.

రూ.53వేల కోట్లతో అమరావతిలో కట్టే ప్రాజెక్టు డెడ్‌ ఇన్ వెస్టమెంట్‌ అని తేల్చేసిన కేసీఆర్.. అదే విషయాన్ని తాను చంద్రబాబుకు కూడా చెప్పానని.. కానీ.. ఆయన వినలేదన్నారు. అమరావతి కట్టటం వేస్ట్ అయ్యా.. దానికి బదులుగా రాయలసీమకు నీళ్లు తీసుకుపో అని చెబితే వినకుండా కట్టాడని.. ఆయనంత ఆయన ఎలకిలాబడ్డాడన్నారు. తన మాటకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుంటే జరిగే నష్టాన్ని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నారని చెప్పాలి. మరి.. దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో?