Begin typing your search above and press return to search.

50 రోజులు..100 స‌భ‌లు..సాధ్యం కాద‌ట‌!

By:  Tupaki Desk   |   24 Sep 2018 5:37 AM GMT
50 రోజులు..100 స‌భ‌లు..సాధ్యం కాద‌ట‌!
X
ముంద‌స్తు కోసం కేసీఆర్ ఎంత ప‌క్కాగా ప్లాన్ చేసింది తెలిసిందే. తాను కోరుకున్న చందంగా వ్య‌వ‌హారాల‌న్ని పూర్తి చేసేందుకు ఆయ‌న గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ చేసిన ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. కేంద్రాన్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌టంతో పాటు.. ముంద‌స్తు ఎపిసోడ్‌కు సంబంధించి ఎలాంటి స‌ర్ ప్రైజ్ లు మోడీ అండ్ కో నుంచి ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఆయ‌న చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఇవ‌న్నీ బాగానే ఉన్నా.. కీల‌క‌మైన ప్ర‌చారానికి సంబంధించిన ప్లాన్ విష‌యంలో కేసీఆర్ అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది మ‌రొక‌టి? అన్నట్లుగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొద‌టి అనుకున్న దాని ప్రకారం యాభై రోజుల్లో 100 స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా.. తెలంగాణ మొత్తం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టాల‌ని.. ఆ దెబ్బ‌కు విపక్షాలు ఉక్కిరిబిక్కిరి కావాల‌ని భావించారు.

అయితే.. అనుకోని రీతిలో వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా గ్రామాల్లో హ‌డావుడి ఉండ‌టంతో.. నిమ‌జ్జ‌నం త‌ర్వాత స‌భ‌ల్ని చేప‌ట్టాల‌ని వాయిదా వేసుకున్నారు. ఆదివారంతో వినాయ‌క నిమ‌జ్జ‌నం పూర్తి కావ‌టంతో.. మొద‌ట అనుకున్న 100 స‌భ‌ల ప్లాన్ కు కాసిన్ని మార్పులు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ముందుగా వేసుకున్న అంచ‌నా ప్ర‌కారం చూస్తే.. ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌టం.. ఆ వెంట‌నే ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు జోరందుకుంటుంది. అదే జ‌రిగితే.. తొలుత అనుకున్న‌ట్లుగా యాభై రోజుల స‌మ‌యం కుదిరే వీలుండ‌దు. అదే జ‌రిగితే.. రోజుకు రెండు చోట్ల స‌భ‌ల‌కు సాధ్యం కాని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో యాభై రోజుల షెడ్యూల్ ను పాతిక రోజుల‌కు కుదించి.. రోజుకు రెండు చోట్ల స‌భ‌లు కాస్తా.. రోజుకు నాలుగు స‌భ‌లు నిర్వ‌హించేలా ప్లాన్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

అదే జ‌రిగితే.. తాను ముందు అనుకున్న‌ట్లుగా వంద నియోజ‌క‌వ‌ర్గాల్నిక‌వ‌ర్ చేసే వీలుంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. అనుకున్నంత తేలిగ్గా అయ్యే వ్య‌వ‌హారం కాద‌ని.. తీవ్ర‌మైన ఒత్తిడితో పాటు.. చేప‌ట్టాల్సిన ప‌నులు చాలానే ఉంటాయ‌ని చెబుతున్నారు. స‌భ‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ఏ మాత్రం తేడా జ‌రిగినా.. మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మంటున్నారు.

స‌భ‌ల ఉద్దేశ‌మే విప‌క్షాల్లోని స్థైర్యాన్ని దెబ్బ తీయ‌ట‌మ‌ని.. అలాంట‌ప్పుడు స‌భ‌ల నుంచి వ‌చ్చే స్పంద‌న మీద‌నే కేసీఆర్ ప్ర‌చారం మొత్తం ఆధార‌ప‌డి ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో వంద స‌భ‌ల‌కు సంబంధించి ప్ర‌త్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోతే ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ తీరుకు త‌గ్గ‌ట్లుగా.. వంద స‌భ‌ల్ని ఎలా నిర్వ‌హిస్తార‌న్న‌ది ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.