కేసీఆర్ ప్రెస్ మీట్: రెండు కీలక నిర్ణయాలు

Tue Dec 11 2018 13:18:10 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ స్పష్టమైన విజయం వైపు పయనిస్తున్న సమయంలో టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ పార్టీ తన జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ ఎస్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీఆర్ ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు 3.45 గంటలకు కేసీఆర్ చేరుకుని అనంతరం విలేకరులతో మాట్లాడుతారు.కాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 12వ తేదీన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం అవుతున్నట్టు తెలిసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీ లెజిస్లేచర్ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.