Begin typing your search above and press return to search.

5 గంట‌ల కేబినెట్ మీటింగ్ ఎంత గుట్టు అంటే..?

By:  Tupaki Desk   |   22 Feb 2019 7:39 AM GMT
5 గంట‌ల కేబినెట్ మీటింగ్ ఎంత గుట్టు అంటే..?
X
ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో కావొచ్చు.. చంద్ర‌బాబు కాలంలో కావొచ్చు.. రోశ‌య్య‌.. కిర‌ణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఎవ‌రి ప్ర‌భుత్వంలో అయినా స‌రే..సాధ్య‌మైన అంశాలు.. తాజాగా కేసీఆర్ హాయాంలో మాత్రం సాగ‌టం లేదు. గ‌తంలో కేబినెట్ మీటింగ్ జ‌రుగుతుందంటే.. అధికారికంగా చెప్పే వివ‌రాలు కాకుండా.. కేబినెట్ మీటింగ్ సంద‌ర్భంగా సాగే వాద‌న‌లు.. ప్ర‌తివాద‌న‌లు.. అలాంటివేమీ లేకున్నా ముఖ్య‌మంత్రి ఎవ‌రినైనా త‌లంటినా.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా అవ‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చేవి.

కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా మారింది. నిన్న‌టి వ్య‌వ‌హార‌మే చూద్దాం. 69 రోజుల త‌ర్వాత మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నిర్వ‌హించారు. సాయంత్రం నాలుగున్న‌ర‌ గంట‌ల‌కు స్టార్ట్ అయిన మంత్రివ‌ర్గ స‌మావేశం రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కూ సాగింది. అంటే.. ఐదు గంట‌ల పాటు మీటింగ్ సాగింది.

అందులోకి తొలి స‌మావేశం కావ‌టంతో ఆస‌క్తిక‌ర అంశాలు చాలానే ఉంటాయి. కానీ.. ఈ రోజు పేప‌ర్లు చూస్తే.. మంత్రివ‌ర్గానికి సంబంధించిన ఏ అంశం బ‌య‌ట‌కు రాలేదు.కేబినెట్ మీటింగ్ లో మాట్లాడే ఏ అంశం బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న కేసీఆర్ స్ట్రిక్ట్ సూచ‌న‌ను మంత్రులంతా తూచా త‌ప్ప‌కుండా పాటించ‌టంతో.. మంత్రివ‌ర్గ స‌మావేశ వివ‌రాలు బ‌య‌ట‌కు పొక్క‌లేదు.

గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి హ‌యాంలోనూ జ‌ర‌గ‌ని ఈ తీరు.. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత నుంచి ప‌రిస్థితి పూర్తిగా మారింది. తొలిసారి ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వంలో అర‌కొర‌గా అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. కొత్త మంత్రివ‌ర్గంలో ఆ ద్వారాలు కూడా పూర్తిగా మూసుకుపోయిన‌ట్లేన‌ని చెబుతున్నారు. ఒక రాజ‌కీయ నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటుంది? ఒక ఉద్య‌మ నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న‌టానికి కేసీఆర్ నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.