Begin typing your search above and press return to search.

సర్వే రిపోర్టుల బిజీలో కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Jan 2019 10:17 AM GMT
సర్వే రిపోర్టుల బిజీలో కేసీఆర్
X
ప్రస్తుతం సీఎం కేసీఆర్ సహస్ర చండీ యాగంతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల చుట్టూనే తిరుగుతోందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. వచ్చే 2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్, వివిధ సర్వే, మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలను ఆయన తెప్పించుకొని వాటిని బేరీజు వేసుకుంటున్నారట.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎంపీ సీట్లు ఇవ్వాలి.? ఎవరు గెలుస్తారనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

కేసీఆర్ తాజాగా ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ఖాయం చేశారని విశ్వసనీయ సమాచారం. అందులో ఒకరు ఎంపీ జితేందర్ రెడ్డి కాగా రెండో వ్యక్తి మాజీ మంత్రి పి. రాములు . ఇక పెద్దపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎంపీ సీటు ఇవ్వాలనే దానిపై కేసీఆర్ డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. మొదట గడ్డం వివేక్ కు పెద్దపల్లి ఎంపీ పదవి అని భావించినప్పటికీ.. ఇటీవల ఎన్నికల్లో వివేక్ సోదరుడు టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేసి బెల్లంపల్లిలో నిలబడడం.. వివేక్ కూడా ధర్మపురిలో టీఆర్ ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించడంతో వివేక్ కు టికెట్ విషయంలో కేసీఆర్ వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనపై కేసీఆర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక ఖమ్మం నుంచి మరోసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే టికెట్ ఖాయం చేసినట్టు టీఆర్ ఎస్ వర్గాల సమాచారం.

కేసీఆర్ ప్రస్తుతం వివిధ వర్గాల నుంచి ప్రజల నాడిని పసిగట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఎంపీలకు ‘కేసీఆర్-కేటీఆర్’లు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. వారంతా ఇప్పటికే తమ నియోజకవర్గంలో రంగంలోకి దిగి పని చేసుకుంటూ పోతున్నారట.. ఇలా యాగం చేస్తున్నా కానీ.. ఎంపీ ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం అందుతోంది.