Begin typing your search above and press return to search.

ముందస్తుకు ప్రతిపక్షాలే కారణం!

By:  Tupaki Desk   |   7 Sep 2018 2:16 PM GMT
ముందస్తుకు ప్రతిపక్షాలే కారణం!
X
తెలంగాణ ఆపద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బుధవారంనాడు శాసనసభను రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ 9 నెలల ముందే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లవలసి వచ్చిందో ఆయన వివరించారు. అయితే కల్వకుంట్ల వారు చెప్పిన కారణాలు చాలా పేలవం గానూ - హాస్యాస్పదంగానూ ఉన్నాయి. 2014 నుంచి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని - అయితే తన పైన - తన పార్టీపైన ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ దుర్భ‌ర‌త్వం బాగా పెరిగిపోయిందని - తెలంగాణ రాష్ట్ర సమితి మొదటినుంచీ తెలంగాణ ప్రజల అభివృద్ధికే పాటుపడిందని అన్నారు. అయితే, తన మీద విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు అడుగడుగున అభివృద్ధికి అడ్డుతగులున్నాయ‌ని ఆయన అన్నారు.

అయితే తన మీద - తన కుటుంబం మీద‌ - అలాగే తెరాస నాయకుల మీద వస్తున్న ఆరోపణలను నిరూపించమని సవాల్ విసిరినప్పటికీ ప్రతిపక్షాలు నిరూపించలేకపోయాయని అందుకే ముందస్తుకు వెళుతున్నామని ఆయన అన్నారు. త‌న మీద - త‌న‌ పార్టీ మీద వస్తున్న ఆరోపణలు నిజమో కాదో ప్రజలే తేలుస్తారని, అందుకే తాను తన పదవిని కూడా పణంగా పెట్టి ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్నామని ఆయన అన్నారు. ఆయన చెబుతున్న ఈ కారణాలు చాలా హస్యాస్పదంగాను - చీప్‌ గాను ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అవినీతి జరగలేదని తెరాస పార్టీయే నిరూపించుకోవాలని, అంతేకానీ ముందస్తుకు ప్రతిపక్షాలను కారణంగా చూపించడం చాలా కామెడీగా ఉందని వారు అంటున్నారు. తన పదవిని పణంగా పెట్టింది రాష్ట్ర ప్రజల కోసం కాదని - ఆయన కుమారుడైన కేటీఆర్ కోసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రగతి నివేదన సభ అట్ట‌ర్ ఫ్లాప్‌ అవ్వడంతో - కేసీఆర్‌ కు ఓటమి భయంతో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య‌ దేశంలో ప్రతిపక్షాలకు అధికార పార్టీని నిలదీసే హక్కు ఉంటుంద‌ని - ప్రతిపక్షాలు అధికార పార్టీపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేదని ముందస్తుకు వెళ‌తామనడం కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడికి తగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికలలో టీఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే - ప్రతిపక్షాలు మళ్లీ అవినీతి ఆరోపణలు చేస్తే గనుక వెంటనే అంటే 2020 లో ముందస్తుకు వెళ‌తారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కల్వకుంట్ల వారు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రజలను పావులు చేసి ఆడిస్తున్నారని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. రోజురోజుకీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చరిష్మా తగ్గిపోతోందని, కల్వకుంట్ల వారి కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, రాబోయే ఎన్నికలలో ఆయనకు ఉద్వాసన తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.