జగన్ కు కేసీఆర్ ఫోన్...కేటీఆర్ ట్వీట్..

Thu May 23 2019 14:52:07 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించి ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అసెంబ్లీ - ఇటు లోక్ సభ ఫలితాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 150  స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గంపగుత్తగా అన్ని స్థానాలను వైసీపీ గెల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా జగన్ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో...వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ సీపీ అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్ - రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

మరోవైపు - టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రజల దీవెనల రూపంలో జగన్ కష్టం ఫలించిందని కేటీఆర్ పేర్కొన్నారు. సోదర రాష్ట్ర పరిపాలనలో మంచి జరగాలని కేటీఆర్ ఆశించారు.