వారిద్దరూ ఏపీలో తిరిగితే...బాబు అవుట్...

Wed Dec 12 2018 11:05:59 GMT+0530 (IST)

వారిద్దరూ తెలంగాణలో జట్టు కట్టారు. వారిద్దరూ మహాకూటమిని సమష్టిగా ఎదుర్కొన్నారు. వారిద్దరు భవిష్యత్ లో కూడా కలిసి నడుస్తామని ప్రకటించారు.వారిద్దరు ఒకరికొక్కరు విజయం సాధించేందుకు సహకరించుకున్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరనుకుంటున్నారా... వారే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు - మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దిన్ ఒవైసీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పాతబస్తీకే పరిమితమనుకున్న మజ్లిస్ పార్టీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తమ ప్రాభల్యముందని నిరూపించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన మజ్లిస్ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. అంతే కాదు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి తాను ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తానని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇది తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేసే పరిణామమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముస్లీం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. ఇన్నాళ్లుగా వారికి సరైన నాయకత్వం లేకపోవడంతో అందులో ఎక్కువ శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్నేహం ఉంది. అలాగే అసదుద్దీన్ ఒవైసీకి కూడా జగన్ పట్ల సానుభూతి ఉంది. దీంతో వీరిద్దరు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పోటీ చేయలేదు. అంతే కాదు... ఖమ్మం - వరంగల్ - కరీంనగర్ తో పాటు జంటనగరాలలో ఆ పార్టీ నాయకులు - కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలాసార్ల ప్రస్తావించారు. దీంతో కె.చంద్రశేఖర రావు - అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడమే కాకుంగా చంద్రబాబు నాయుడి ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయంటున్నారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లో తిరిగితే తెలుగుదేశం పార్టీకి... ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి గడ్డుకాలం వచ్చినట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.