Begin typing your search above and press return to search.

గజం వందా... తీసుకో ఇందా..

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:23 AM GMT
గజం వందా... తీసుకో ఇందా..
X
గజం స్ధలం ఖరీదు ఎంతుంటుంది. హైదరాబాద్ - సికింద్రాబాద్‌ లో అయితే లక్షల్లోనూ - శివారులో అయితే వేలల్లోనూ ఉంటుంది. అదే కరీంనగర్ - వరంగల్ - నిజామాబాద్ - ఖమ్మం వంటి పట్టణాల్లో అయితే అథమ పక్షం ఐదు వేలకు తగ్గదు. కాని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం గజం స్ధలాన్ని కేవలం వంద రూపాయలకే ఇచ్చేస్తోంది. ఎవరికనుకుంటున్నారు. పేదలకు - నిరుపేదలకు కాదు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలు కట్టుకుందుకు కేవలం వందంటే వంద రూపాయలకే గజం వంతున కట్టపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించింది. తెలంగాణలో ఎన్నికలోపు ప్రతి పట్టణంలోనూ - గ్రామంలోనూ - వార్డు స్ధాయిలోనూ పార్టీ కార్యాలయాలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా స్థలాలను గుర్తించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని కూడా నాయకులకు సూచించారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న కె.చంద్రశేఖర రావు ఈ స్ధలాల ఎంపిక పూర్తి చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నాయకులందరూ వారి వారి నియోజకవర్గాల్లోనూ - గ్రామాల్లోనూ - పట్టణాల్లోనూ, నగరాల్లోనూ స్ధలాల పరిశీలన ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వ అనుమతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడే ఓ సమస్య వచ్చింది. అదేమిటంటే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే స్ధలాలు కేటాయించి వందకు గజం వంతున ఇస్తే ప్రతి పక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఇందులోంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. అదే రాజకీయ పార్టీలకు వందకు గజం వంతున స్ధలం కేటాయించడం.

ఇంతకు ముందు ప్రభుత్వ స్ధలాలను ఆయా రాజకీయ పార్టీలకు లీజుకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఏకంగా అమ్మకాలే చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం - ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిపోయింది. ఇందులో భాగంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో స్ధలాలను ఎంపిక కూడా చేసేసుకుంది. ఇక మిగిలిన పార్టీలకు ఆయా జిల్లాల్లో స్ధలాల కేటాయింపు మాత్రమే మిగిలింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు స్ధలం కోసం దరఖాస్తు చేసుకోవడం... వందకే గజం వంతున ఒక్కో పార్టీకి ఎకరానికి మించకుండా స్ధలాలను కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు - ఇంటి స్ధలాలు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించే తెలంగాణ సర్కార్ రాజకీయ పార్టీలకు ఎకరాలకు ఎకరాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. వేలు, లక్షలు ఖరీదు చేసే ప్రభుత్వ భూములను పార్టీలకు ఇలా కేటాయించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే వారి ఆగ్రహాన్ని పట్టించుకునే పార్టీలే ఉండవు. ఎందుకంటే వారికి ఈ వందకు గజం పథకం వర్తిస్తుంది కదా... ! అంటున్నారు సామాన్యులు. రాజు తలచుకుంటే దెబ్బలకు.... స్ధలాలకు కొదవ ఎక్కడుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.