Begin typing your search above and press return to search.

రోమింగ్ సీఎం హైదరాబాద్ లో ఉండేదెప్పుడు?

By:  Tupaki Desk   |   23 July 2016 6:56 AM GMT
రోమింగ్ సీఎం హైదరాబాద్ లో ఉండేదెప్పుడు?
X
దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండదేమో. ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని తీరులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్న విమర్శ రోజురోజుకీ ఎక్కువవుతోంది. తనకు మాత్రం ఇల్లు లాంటిదే అంటూ ఫాంహౌస్ కు తరచూ ప్రయాణం కడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి మెదక్ జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం లోని ఎర్రవల్లికి పయనమయ్యారు.

ఈ వారం మొదట్లో హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. ఢిల్లీకి వెళ్లటం.. అనారోగ్యంగా ఉందంటూ ఎక్కువగా ఢిల్లీలోని తన అధికారిక భవనంలోనే విశ్రాంతి తీసుకోవటం.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం అధికారులతో భేటీ అయిన ఆయన.. తాను త్వరలో హరితహారం కార్యక్రమం ఎలా జరుగుతుందన్న విషయం మీద ఆకస్మిక తనిఖీలు చేపడతానని చెప్పటం తెలిసిందే. అలా చెప్పేసిన ఆయన.. కాసేపటికే ఫాంహౌస్ కు జర్నీ కట్టేశారు.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఎర్రవల్లికి చేరుకున్న కేసీఆర్.. శని.. ఆదివారం రెండు రోజుల్ని ఫామ్ హౌస్ లోనే గడపనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వారంలో ఆయన రాజధాని నగరమైన హైదరాబాద్ లో గడిపింది.. అధికారికకార్యక్రమాల్లో పాల్గొన్నది ఏమీ లేదనే చెప్పాలి. మరి.. అదే పనిగా ఫామ్ హౌస్ కి వెళుతున్న సీఎం పుణ్యమా అని సర్కారు పని తీరులో వేగం మందగిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే హైదరాబాద్ రోడ్ల మీద సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్ పదే పదే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేని సంగతి తెలిసిందే. హెడ్ క్వార్టర్ లో లేకుండా అదే పనిగా రోమింగ్ చేసే ముఖ్యమంత్రి పాలనలో అధికారులు.. తమకు అప్పగించిన పనిని ఉరుకులు పరుగులతో పూర్తి చేస్తారని ఆశించటం అత్యాశే అవుతుందేమో..?