కేఏ పాల్... మామూలోడు కాదబ్బా

Mon Apr 15 2019 20:00:58 GMT+0530 (IST)

కేఏ పాల్... ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలకు కామెడీని పంచిన వ్యక్తి కిందే లెక్క. ప్రధాన పార్టీల నేతలు ఘాటు పదాలతో వైరి వర్గాలపై విరుచుకుపడుతుండటం - ఆగ్రహావేశాలతో ఊగిపోవడం - నేతలను ఓన్ చేసుకునే వారంతా ఆవేశాలకావేశాలకు పోవడం - టెన్షన్ వాతావరణం నెలకొనడం లాంటి పరిస్థితుల మధ్య పాల్ గానీ లేకుంటే ఇంకేమైనా ఉందా? అన్న వాదన కూడా బాగానే వినిపించింది. హై ఓల్టేజీ ఎన్నికల్లో పాల్ కామెడీ జనాలను ఆ వేడి నుంచి కాస్తంత ఉపశమనం కలిగించేసిందన్నది మెజారిటీ ప్రజల భావన. రాజకీయాల్లోకి దిగి ఏదో సాధిద్దామని బాకాలు ఊదిన పాల్... ఆ దిశగా సాధించిందేమీ లేకున్నా... ఫక్తు కమెడియన్ గానే మిగిలిపోయారు. అయితే పాల్ గతం గురించి తెలిస్తే మాత్రం... ఆయన మామూలోడు కాదనే చెప్పాలి.తెలుగు నేలకే చెందినప్పటికీ... క్రైస్తవ బోధకుడిగా మారిన తర్వాత అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నెరపిన పాల్ చాలా దేశాలను చుట్టేశారన్న విషయం మనకు తెలిసిందే. అయితే క్రిస్టియన్ ప్రీస్ట్ గా పాల్ కు ఇతర సామాజికాంశాల మీద అంతగా అవగాహన లేదని చెప్పడానికేమీ లేదు. సమకాలీన సామాజిక అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణలు వినిపించిన పాల్... తలలు పండిన రాజకీయ నేతలతో పాటు చిక్కు ముడులతో ప్రశ్నలు సంధించే మీడియా ప్రతినిధులను కూడా ఆశ్యర్యానికి గురి చేసిన దాఖలాలు కోకోల్లలనే చెప్పాలి. పాల్ లోని ఈ తరహా సత్తాకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఈ వీడియో ఎప్పటిదన్న విషయాన్ని పక్కనపెడితే... రాజకీయాల్లోకి రాకముందు అమెరికాకు చెందిన ప్రఖ్యాత న్యూస్ చానెల్ ఫాక్స్ న్యూస్ కు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు చెందినదే ఈ వీడియో. ఈ వీడియోలో ప్రపంచంలోని పలు దేశాలను పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రస్తావించిన పాల్... ఆ సమస్యల నుంచి ఆయా దేశాలను విముక్తులు కావించేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి తనదైన శైలిలో వివరించారు. ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమేందుకు అమెరికా సాయం చేయాల్సిన అవసరం ఉందని వాదించిన పాల్... మరిన్ని సమస్యలను ప్రస్తావించి ఔరా అనిపించారు. ఈ వీడియోను చూస్తుంటే... అంతటి విషయం ఉన్న పాల్ ఈ ఎన్నికల్లో కమెడియన్ గా ఎలా మారారంటూ ముక్కున వేలేసుకోక తప్పదు.