ఢిల్లీకి వెళ్లిన పాల్.. ఎందుకో తెలుసా?

Mon Apr 15 2019 16:40:55 GMT+0530 (IST)

హాట్ హాట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఆ హీట్ ను తగ్గించి.. అంత ఉద్రిక్తతలోనూ కాసింత కామెడీ పండేలా వ్యవహరించిన క్రెడిట్ మాత్రం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కే చెందుతుంది. చిత్రమైన వ్యాఖ్యలు.. అంతకు మించిన హావభావాలతో పాటు.. చివర్లో ఆయన అనుసరించిన తీరుకు మీడియాలో భారీ ప్రాధాన్యత లభించిన పరిస్థితి. ఎన్నికల్లో ఆయన చూపే ప్రభావం ఎంతన్న విషయం అందరికి తెలిసిందే అయినా.. పాల్ లాంటి రాజకీయ నేతలు కూడా ఉంటారా? అన్న భావన  కలుగజేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు.తాజాగా ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తరహాలో పాల్ మాటలు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రాన్ని.. ఈసీని తప్పుపడుతూ మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో ఈసీ నిర్లక్ష్యాన్ని తాజాగా కేఏ పాల్ తప్పు పడుతున్నారు.

ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని.. బీజేపీకి ఏపీలో బలం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని  గెలిపించాలని చూస్తున్నట్లు చెప్పారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఏమీ చేయకుంటే మోడీ దేశాన్ని నాశనం చేస్తారంటూ పాల్ హెచ్చరించారు. ఈవీఎంల సమస్యకు పరిష్కారం చూపకుంటే ఎన్నికల్ని బహిష్కరించాలన్నారు. తానుపోటీ చేసిన నియోజకవర్గంలో నలభై పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదన్నారు.

దేశంలోనూ.. రాష్ట్రంలోనూ పరిస్థితి ఘోరంగా ఉందని పదే పదే చెబుతున్నా.. ఏ పార్టీ నేతలు పట్టించుకోలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఈవీఎంల మీద తాను మొదట్నించి పోరాడుతున్నానని.. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రులు చంద్రబాబు.. మమత..నవీన్ పట్నాయక్ లతో పాటు.. డీఎంకే అధినేత స్టాలిన్.. ఎస్పీ అధినేత అఖిలేశ్ తదితరులు మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు.  బాబు బాటలోకి కేఏ పాల్ వెళ్లి ఢిల్లీకి వెళ్లి హడావుడి చేయటం దేనికి నిదర్శనం?