Begin typing your search above and press return to search.

సెటైర్ః బాబును హిప్న‌టైజ్ చేసిన జైట్లీ

By:  Tupaki Desk   |   28 Oct 2016 2:36 PM GMT
సెటైర్ః బాబును హిప్న‌టైజ్ చేసిన జైట్లీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో ప్రత్యేక హోదా - ఆర్థిక‌ ప్యాకేజీకి తేడా లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మోసపు మాటలు ఇకనైనా మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయ‌ప‌డ్డారు. గత ఎన్నికలలో రాష్ట్రానికి 10 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామనే బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీకి చంద్రబాబు భజన చేయ‌డం చూస్తుంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హోదా అడ‌గ‌కుండా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబును హిప్నటైజ్ చేసినట్లుందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీకి-హోదాకు తేడా ఏమీలేదని, ప్రత్యేక హోదా వస్తే కేంద్ర పథకాలకు 90% నిధులొస్తాయనీ, ఇప్పడు ఆ లోటును విదేశీ నిధులతో భర్తీచేస్తామని బాబు చెప్పడం ఇందుకు నిద‌ర్శ‌నమ‌ని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదా సాధించుకోలేని చంద్రబాబు, విదేశీ నిధులు తెస్తాననడం "ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉంది" అని రామ‌కృష్ణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా హక్కుని కాదని, రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి నిధులు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. "ప్రత్యేక హోదాకు-ప్యాకేజీకి లేకపోతే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రత్యేక హోదా కావాలని ఎందుకు గగ్లోలుపెడుతున్నాయి? నిన్నమొన్నటివరకు కేంద్రం సక్రమంగా నిధులు ఇవ్వడంలేదని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్డీఏ నుంచి వైదొలగుతామని, కేంద్రం ఇచ్చే ప్యాకేజీవల్ల ఒరిగేదేమీ లేదని, ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పోరాడతామని చెప్పిన చంద్రబాబు ఇప్పడు కేంద్రం నుండి పూర్తి సహాయం అందుతున్నదని, హోదాకు ప్యాకేజీకి వ్యత్యాసం లేద‌ని కేంద్రమంత్రులు ఎంతో సహాయం చేస్తున్నారని చెప్పడం వెనుక మ‌ర్మం ఏంటి?" అంటూ నిల‌దీశారు. చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయి రాష్ట్ర ప్రయోజనాలకు మంటగలుపుతున్నార‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పదోవపట్టించే విధంగా రెండు నాల్క‌ల ధోరణితో మాట్లాడటం వెంకయ్యనాయుడు నుంచి చంద్రబాబు వంటపట్టించుకున్నట్లున్నదని ఎద్దేవా చేశారు. ఏకపక్ష విధానాలకు తిలోదకాలివ్వాలని చంద్రబాబుకు హితవు పలికారు. మాటమార్చిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రెండేళ్ళ కాలంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామ‌కృష్ణ కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/