Begin typing your search above and press return to search.

ఆంధ్రాకు ఓకే అంటూనే కేకే పెట్టిన మెలిక

By:  Tupaki Desk   |   30 April 2016 5:03 AM GMT
ఆంధ్రాకు ఓకే అంటూనే కేకే పెట్టిన మెలిక
X
ఆంధ్రా గురించి.. ఆంధ్రోళ్ల ఇబ్బందుల్ని ప్రస్తావించిన టీఆర్ ఎస్ ఎంపీ కేకే (కె.కేశవరావు) తన మనసులోని మాటను చెప్పేశారు. నిత్యం తెలంగాణ ప్రయోజనాలు తప్పించి ఏపీ ఇబ్బందుల గురించి ఎప్పుడూ పెద్దగా ప్రస్తావించని టీఆర్ ఎస్ పార్టీ నేత కేకే.. ఆంధ్రోళ్ల మీద ప్రేమ ప్రదర్శించారు. అయితే.. ఈ ప్రేమలో చిన్న మెలిక ఉంది. పైకి చూసేందుకు సానుకూలంగా మాట్లాడినట్లు మాట్లాడుతూనే.. ఎక్కడ పెట్టాలో అక్కడ మెలికి పెట్టిన తెలివి కనిపిస్తుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేకే.. మరోమాట చెప్పి షాకిచ్చారు.అదే సమయంలో విభజన కారణంగా శుక్రవారం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి జరిగిన చర్చ సందర్భంగా టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే (కె. కేశవరావు) మాట్లాడుతూ.. ఏపీ పట్ల సానుకూలతను ప్రదర్శించటమే కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కేకే నోట ఇలాంటి మాట అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే వేళ.. అసలు విషయాన్ని చివర్లో చిన్నమాటగా చెప్పి.. దిమ్మ తిరిగిపోయే పంచ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణల మధ్య శతృత్వం లేదంటూనే.. విభజన బిల్లును హడావుడిగా తెచ్చారని ఆంధ్రావారు అన్నా.. బిల్లు శాస్త్రీయంగా ఉందన్నారు. కేవీపీ పెట్టిన ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు స్ఫూర్తిని అర్థం చేసుకోవాలన్నారు.

ఏపీ వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారని.. వారి ఆర్థిక స్థితి బాగోలేదని.. రాజధానిని కట్టుకోవటానికి కూడా వారు డబ్బుల్లేక సాయం కోసం చూస్తున్నారని కేకే వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పోలవరం ముంపు ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి చెందింది. పోలవరం కట్టటంలో తప్పు లేదు. దాన్ని మేం వ్యతిరేకించటం లేదు. దాని వల్ల 2.5లక్షల మంది గిరిజనులు ముంపునకు గురవుతున్నారు. వారిని కాపాడొచ్చేమో చూడండి. పోలవరం డిజైన్ మారిస్తే నిర్వాసితుల ముంపు తగ్గించొచ్చు. అలాగే ఏపీ వాళ్లు ప్రత్యేక హోదా అడుతున్నారు. మాకు అభ్యంతరం లేదు’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత చివర్లో చావుకబురు చల్లగా చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంతో పాటు.. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ మాట ఒక్కటి చాలు.. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది రాకుండా చేయటానికి.