జ్యోతుల నెహ్రూకూ కోపమొచ్చిందండోయ్!

Thu Sep 14 2017 10:08:00 GMT+0530 (IST)


గతంలో తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు కర్ణాటక సరిహద్దులో కారులో వస్తూ టోల్ గేట్ సిబ్బంది ఆపారని అనుచరులతో కలిసి వారిని చితకబాదిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ  అదే కోవలో.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే తన కుమారుడితో కలిసి టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఆ ఇద్దరూ ఎవరో కాదండి. గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వై సీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం చేరిన జ్యోతుల నెహ్రూ కాగా మరొకరు ఆయన పుత్రరత్నం.. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్.

వీరు ఎందుకు టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. నెహ్రూ అల్లుడు తోట బబ్బీ కారులో వస్తుండగా కిర్లంపూడి మండలంలోని కృష్ణవరం జాతీయరహదారిపై టోల్ ప్లాజా వద్ద సిబ్బంది రుసుము కోసం ఆపారు. ఇదే పాపమన్నట్టు రెచ్చిపోయిన జ్యోతుల అనుచరులు సిబ్బందిని చితకబాదారు. అంతటితో ఆగకుండా క్షమాపణ చెప్పేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందిపై మరోసారి దాడికి తెగబడ్డారు.

అంతే కాదండోయ్... తమ అధికార దర్పాన్ని చాటుకున్న వారు టోల్ గేట్ యాజమాన్యంతో చెప్పించి ఇద్దరు సిబ్బందిపై వేటు వేయించారు. అధికార బలంతో చిరు ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డ జ్యోతుల కుటుంబంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం మిగతా సిబ్బందికి తెలియడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. నిజాయితీగా వ్యవహరిస్తే ఇదేమి దండనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.