Begin typing your search above and press return to search.

జగన్ గురించి జ్యోతుల చెప్పిన కొత్త సంగతులు

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:25 AM GMT
జగన్ గురించి జ్యోతుల చెప్పిన కొత్త సంగతులు
X
ఇంటిగుట్టు తెలిసినోళ్లతో మా చెడ్డ ఇబ్బంది. అలాగే అధినేతలకు సన్నిహితంగా మెలిగి.. పార్టీని విడిచి పెట్టినోళ్లు కానీ నోరు విప్పితే సదరు అధినేతలు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు తెలియంది ఏమీ ఉండదు. అలానే జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన జ్యోతుల నెహ్రూ కావొచ్చు.. భూమా నాగిరెడ్డి కావొచ్చు.. వారికి తెలియని విషయాలంటూ ఏమీ ఉండకపోవచ్చు. జగన్ ను అసాంతం చదివేసిన అలాంటి వారు నోరు విప్పితే జగన్ కు ఎంత డ్యామేజ్ అన్నది జ్యోతుల తాజా విమర్శలు చెప్పకనే చెప్పేస్తాయి.

ఏదో మాట్లాడామంటే మాట్లాడామన్నట్లు కాకుండా పాయింట్ టు పాయింట్ ఎత్తి చూపిస్తూ జ్యోతుల నెహ్రు సంధించిన విమర్శనాస్త్రాలు విన్నప్పుడు అరే.. జగన్ మరీ ఇలా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలగటంతో పాటు.. ఆయన సందేహాల్లో లాజిక్ ఉందన్న భావన కలగటం ఖాయం. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన జ్యోతుల నెహ్రూ.. తమ ఎక్స్ బాస్ జగన్ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

తాము అమ్ముడుబోయినట్లుగా ఆరోపణలు చేస్తున్న జగన్.. తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ ఎస్ లోకి వెళ్తే మాత్రం ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించిన జ్యోతుల.. ‘‘మాపై చేసిన ఆరోపణలు ఏవీ ఆయనపై చేయలేదు. ఆయన్ను కోట్ల రూపాయిలకు జగనే కేసీఆర్ కు అమ్మేశారా? అందుకే కిక్కురమనటం లేదా? ఈ విషయం మీద మాకు సమాధానం కావాలి. మా నాయకుడివని ఇంతకాలం నిన్ను పొగిడాం. ఇప్పుడు తిట్టటానికి మనస్కరించటం లేదు. కానీ.. నా ప్రశ్న ఒక్కటే. రాజకీయాల్లో వచ్చినప్పుడు నీ కుటుంబ స్థితిగతులేంటి? మా కుటుంబ స్థితిగతులేంటి? ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎంత? బహిరంగంగా మీడియా ముందు శ్వేతపత్రాలు ఇద్దాం. చర్చిద్దాం. చేతనైతే రా’’ అంటూ ఫైర్ అయ్యారు.

తాము కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. ఎన్టీఆర్.. వైఎస్ ఇలా ఎందరో ముఖ్యమంత్రుల్ని చూశామని.. వారు సీఎంలుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం వెళ్లి వారి దగ్గర పనులు చేయించుకునేవాళ్లని.. కానీ జగన్ మాత్రం ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు తన ఎమ్మెల్యేలు వెళ్లకూడదంటారని విమర్శించారు. ‘‘పూతలపట్టు ఎమ్మెల్యే తల్లికి ఆపరేషన్ కు రూ.5లక్షలు అవసరమై ఇబ్బంది పడుతుంటే.. నేను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించా. ఈ విషయంపై జగన్ తప్పు పట్టారు. శాసనసభాపక్ష ఉప నేతను అయినప్పటికీ జగన్ పక్కన కూర్చోకూడదు. ఐదు సమావేశాలకు మూడు సమావేశాల్లో నన్ను కూర్చోనివ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సీట్లో కూర్చుంటారు కాబట్టి తానూ ఒకేసీట్లో కూర్చోవాలని జగన్ భావిస్తుంటారు. జగన్ కు అంత అహంకారం’’ అని మండిపడ్డారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో తన దగ్గరకు వచ్చిన నేతల్ని జగన్ ఒక ప్రశ్న అడిగేవారని.. ‘‘పది కోట్లు ఉన్నాయా? అలా ఉంటే ఆ తర్వాత అంతా నీదే’’ అంటూ మాటలు చెప్పేవారని.. అంటే పార్టీ గెలిచిన తర్వాత అంతా నీ ఇష్టం.. తోచినంత దోచుకోవచ్చన్నదే జగన్ మాటలకు సారాంశం’’ అంటూ జ్యోతుల ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. పాయింట్ల వారీగా జ్యోతుల చేసిన విమర్శలు లాజిక్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి మాటలు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయనటంలో సందేహం లేదు.