గాడ్సేపై గుత్తా జ్వాల... బీజేపీని ఏకేసిందిగా

Sun May 19 2019 11:11:03 GMT+0530 (IST)

జాతిపిత మహాత్మా గాంధీని జనం కళ్ల ముందే కాల్చి చంపిన నాథూరాం గాడ్సే... ఈ ఎన్నికల్లో బాగానే వినిపించిన పేరు. గాంధీని హత్య చేసిన గాడ్సేను బీజేపీ నేతలు దేశభక్తుడిగా కీర్తించిన వైనంతో నిజంగానే గాడ్సే పేరు ఈ ఎన్నికల్లో మారుమోగిపోయిందనే చెప్పాలి. బీజేపీ నేత  సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకకే చెందిన మరో బీజేపీ నేత నళిన్ కుమార్ లు గాడ్సేపై వరుసగా కామెంట్లు చేసి... ఆయనను ఓ దేశభక్తుడిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా చాలా పార్టీలు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎన్నికల్లో కీలక స్థానాలకు పోలింగ్ జరుగుతున్న వేళ... ఈ గోల మరింత ఎక్కువగా వినిపించిందనే చెప్పాలి.సరే... ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసిపోగా... రేపటి పోలింగ్ తో సార్వత్రిక సమరంలో కీలక ఘట్టమైన పోలింగ్ కు శుభం కార్డు పడ్డట్లే. ఓ నాలుగు రోజుల తర్వాత ీ నెల 23న జరిగే కౌంటింగ్ తో ఎవరి భవిష్యత్తు ఏమిటో తేలిపోనుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారాణి గుత్తా జ్వాల... గాడ్సే వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగిసిపోయిందనుకున్న ఈ వివాదం ఇప్పుడు గుత్తా జ్వాల వ్యాఖ్యలతో మరోమారు చిచ్చు రగిలే అవకాశాలేమీ లేకున్నా.. గుత్తా జ్వాల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాకుండా... బీజేపీ వైఖరిని దునుమాడేసేలానే ఉన్నాయి.

నేరుగా బీజేపీని నేరుగా పేరు పెట్టి పిలవకుండా ఆ పార్టీ నేతలను ప్రస్తావిస్తే వ్యాఖ్యలు చేసిన జ్వాల... గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలియదని సంచలన వ్యాఖ్య చేశారు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించుకుంటున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిబట్టి భవిష్యత్ లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే తనకు నిజంగానే భయం కలుగుతోందని గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలతో గుత్తా జ్వాల బీజేపీ నేతల తీరును ఏకి పారేసిందని చెప్పక తప్పదు.