Begin typing your search above and press return to search.

క‌విత కోసం....క‌ర్ష‌కులకు క‌ష్టాలు!

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:41 AM GMT
క‌విత కోసం....క‌ర్ష‌కులకు క‌ష్టాలు!
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని తెలంగాణ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు - విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ విమ‌ర్శించారు. ప్రకృతి అనుకూలించకపోవడంతో కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడం ప‌క్క‌న‌పెట్టి సొంత ఆస‌క్తుల కోసం మాత్రం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. పుష్కరాలు - బతుకమ్మలకు మాత్రం కోట్ల రూపాయలను విడుద‌ల ఇచ్చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని అయితే అదే స‌మ‌యంలో త‌న సొంత ఆస‌క్తులు - కూతురు క‌విత ఆధ్వ‌ర్యంలోని సంబ‌రాల‌కు మాత్రం అత్యంత ప్రాధాన్య‌త ద‌క్కుతోంద‌ని మండిప‌డ్డారు.

రైతులకోసం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి విడుదల చేస్తే రైతుల అప్పులు తీరేవని జ‌స్టిస్ చంద్ర‌కుమార్ చెప్పారు. అలా చేయకుండా ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా విడుదల చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే అదే స‌మ‌యంలో బ‌తుక‌మ్మ పండుగ‌కు మాత్రం కోట్లాది రూపాయ‌లు చెల్లించార‌ని విమ‌ర్శించారు. రుణమాఫీ జరగని కారణంగా రైతులకు కొత్తరుణాలు అందడం లేదని జ‌స్టిస్ చంద్ర‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడం వలన విడుదల చేస్తున్న మొత్తం వడ్డీకి సరిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం పంటరుణంపై వడ్డీ లేదంటుంటే బ్యాంకర్లు మాత్రం 4 శాతం నుండి 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు పండించిన ఏ పంటకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఒకేసారి రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసి రైతులను రుణవిముక్తులను చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు.

రైతులపై వడ్డీ భారాన్ని తొలగించి కొత్తరుణాలను ప్రతి రైతుకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జ‌స్టిస్ చంద్ర‌కుమార్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్య - వైద్యం - నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని - రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని - ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/