Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎంపీలకు మంత్రి పదవి దక్కబోతుందా.?

By:  Tupaki Desk   |   22 Jun 2019 12:04 PM GMT
జంపింగ్ ఎంపీలకు మంత్రి పదవి దక్కబోతుందా.?
X
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన ఎంపీలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయా..? దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆ ఎంపీలు బీజేపీ జాతీయాధ్యక్షుడు ముందు ఉంచారా..? ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి సదరు ఎంపీలకు స్పష్టమైన హామీ లభించిందా..? కొద్దినెలల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జట్టులోకి వీళ్ల ఎంట్రీ ఉండబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా హల్‌ చల్ చేస్తోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మొదట వీరు తమ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. అయితే, ఈ పరిణామానికి ముందే వీరంతా బీజేపీ జాతీయాధ్యక్షుడు - హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో తమలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన ముందు ప్రతిపాదనను ఉంచారని ప్రచారం జరుగుతోంది. దీనికి షా అంగీకారం తెలిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నలుగురిలో సుజనా చౌదరి - సీఎం రమేష్ - టీజీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారు కాగా - గరికపాటి రామ్మోహన్‌ మాత్రం తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాబట్టి ఏపీ నుంచి ఒకరికి - తెలంగాణ నుంచి గరికపాటికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ కలిసి పని చేశాయి. ఆ సమయంలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా - సుజనా చౌదిరికి సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా ఇద్దరికి ఛాన్స్ దక్కబోతుందట.

ఇదిలాఉండగా, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరిన పరిణామం సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై పలు జాతీయ పార్టీలకు చెందిన నేతలు సైతం స్పందిస్తున్నారు. బీజేపీ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తమ పార్టీకి చెందిన ఎంపీలు చేసిన పనికి వాళ్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే సుజనా చౌదరి - సీఎం రమేష్ లాంటి వారు పార్టీని వీడారని దుమ్మెత్తిపోస్తున్నారు.