Begin typing your search above and press return to search.

కేంద్రం మాటతో కుర్చీలాట

By:  Tupaki Desk   |   29 July 2016 7:06 AM GMT
కేంద్రం మాటతో కుర్చీలాట
X
పార్టీ మారినా ఎన్నికల్లో టికెట్లకు ఢోకా ఉండదని ఇప్పటివరకూ ధీమాతో తెదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. 2026 వరకూ నియోజకవర్గ పునర్విభజన ఉండదని అటార్నీ జనరల్ కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో, ఇక తమ రాజకీయ భవిష్యత్తేమిటన్న భయం వారిలో మొదలైంది. మళ్లీ టికెట్లు దక్కుతాయో - లేదోనన్న బెంగ పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో మొదలయింది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారన్న భరోసాతో - తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆందోళనలో పడింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయి కాబట్టి, అందులో మీకు సీట్లు సర్దుబాటు చేస్తామన్న బాబు హామీని విశ్వసించి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలకు - 2026 వరకూ సీట్ల సంఖ్య పెరగదన్న వార్త షాకిచ్చింది.

టీడీపీలో చేరిన వారిలో వర్మ - ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలిచి తెదాపాలో చేరినందున వారికొచ్చిన భయం ఏమీ కనిపించడం లేదు. ఇక పలమనేరులో అమర్‌ నాధ్‌ రెడ్డి ఒక్కరికే స్థానికంగా తెదేపా నుంచి పెద్దగా పోటీ లేదు. ఎందుకంటే ఆయన గత ఎన్నికల ముందే తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వచ్చారు. మిగిలిన 19 నియోజకవర్గాల్లో తెదేపా పాత సీనియర్లతో విపరీతమైన పోటీ కొనసాగుతోంది. ప్రకాశం - కడప - కర్నూలు జిల్లాల్లోనయితే దాదాపు ప్రతిరోజూ కొత్త-పాత ఎమ్మెల్యేలు ఘర్షణ పడి రోడ్డున పడుతూనే ఉన్నారు.

అటు తెలుగుదేశంలో సీనియర్ల పరిస్థితి కూడా ఆందోళనగానే ఉంది. వైసీపీ నుంచి పార్టీలో చేర్చుకునే ముందు, వారి చేరికలకు అడ్డుపడిన సీనియర్లను బాబు బుజ్జగించారు. మీ భవిష్యత్తునకు వచ్చిన ఇబ్బందేమీలేదని, నియోజకవర్గ సంఖ్య పెరుగుతున్నందున మీకు కూడా సీటు ఇస్తామని భరోసా ఇచ్చారు. తాజా పరిణామంతో కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తారా? అన్న ఆందోళన సీనియర్లలో మొదలయింది. అటు తెదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. వారు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.