జగన్ వద్దకు తారక్ మామ!... ఏం జరుగుతోంది?

Mon Feb 18 2019 15:25:51 GMT+0530 (IST)

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... సంచలనాల మీద సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షాల నుంచి అధికార పార్టీలోకి చేరికలు ఉండాల్సింది పోయి... అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నుంచి విపక్షంలోకి చేరికలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎంపీలు - ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రధాన విపక్షం వైసీపీలో చేరిపోయారు. అదే సమయంలో టీడీపికి చెందిన దాసరి జై రమేశ్ లాంటి కీలక నేతలు కూడా వైసీపీ బాటలోనే నడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ మామ గారు నార్నె శ్రీనివాసరావు కాసేపటి క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రచారం చేసిన తారక్... ఆ తర్వాత టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైఖరితో మనసు నొచ్చుకున్న తారక్... టీడీపీకి దూరంగా జరిగారు. నాటి నుంచి నేటి దాకా ఏనాడూ టీడీపీకి దగ్గరిగా చేరని తారక్... పార్టీతో గ్యాప్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ కీలకంగా భావిస్తున్న 2019 ఎన్నికలకు ముందు తారక్ ఎలా వ్యవహరిస్తారన్న విషయంపైనా అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా దింపిన చంద్రబాబు... వ్యూహాత్మకంగా ఎన్టీఆర్‌ను మళ్లీ తెరపైకి తీసుకుని వచ్చేందుకు యత్నించారు. అయితే చంద్రబాబు జిమ్మిక్కులను బాగానే పసిగట్టిన తారక్.. తన సోదరిని గెలిపించాలంటూ ఓ పత్రికా ప్రకటన విడుద చేసి సైలెంట్‌గా ఉండిపోయారు.

అక్కడి ఎన్నికల్లో సుహాసిని ఓడిపోయినా తారక్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తారక్ పూర్తిగా టీడీపీని పక్కనపెట్టేశారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి కీలక తరుణంలో తారక్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ నేపథ్యం ఏమిటన్న విషయం బయటకు రానప్పటికీ... టీడీపీ శిబిరంలో పెను కలకలమే రేపుతోందని చెప్పక తప్పదు. జగన్ ను తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని నార్నె చెబుతున్నా... తారక్ కు తెలియకుండా నార్నె లోటస్ పాండ్‌కు వెళ్లి ఉంటారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలైన నేపథ్యంలో జగన్ తో నార్నె భేటీ... తారక్ భవిష్యత్తు వ్యూహాలపై కొత్త చర్చకు తెర లేపిందనే చెప్పాలి.