Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీలో వంద‌లాది చేరిక‌లు!

By:  Tupaki Desk   |   25 Jun 2019 5:15 AM GMT
రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీలో వంద‌లాది చేరిక‌లు!
X
గురి పెడితే అంతే. క‌న్ను ప‌డితే సొంతం కావాల్సిందే. మొన్న‌టివ‌ర‌కూ రెండు తెలుగు రాష్ట్రాల మీద సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో పార్టీ ఎదుగుద‌ల కోసం ప్ర‌య‌త్నించిన బీజేపీ పెద్ద‌లు.. అవేవీ వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టంతో రూటు మార్చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టంతో వారి ఆలోచ‌న‌లు మొత్తంగా మారిపోయాయి.

తెలంగాణ‌లో బీజేపీ కి స్పేస్ ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన వారు.. ఇప్ప‌టివ‌ర‌కు తాము స‌రిగా ఫోక‌స్ చేయ‌క‌పోవ‌టంతోనే పార్టీ ఎద‌గ‌లేద‌ని.. త‌మ స్థాయిలో పావులు క‌దిపితే.. తెలంగాణ‌లో స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మార‌ట‌మే కాదు.. ద‌క్షిణాదిన పాగా వేయాల‌న్న త‌మ ఆలోచ‌న ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురావొచ్చ‌న్న విష‌యాన్ని వారు గుర్తించారు.

నాటి నుంచి తెర వెనుక చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇప్పుడు ఒక స్థాయికి రావ‌ట‌మే కాదు.. మ‌రో రెండు రోజుల్లో తెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త హ‌డావుడి ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. టీఆర్ ఎస్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయెల్ ను క‌లిశారు. తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసే అంశంపై చ‌ర్చించారు. టికెట్ ఇచ్చే విష‌యంలో హ్యాండిచ్చిన కేసీఆర్ మీద గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. రెండు రోజుల్లో (ఈ నెల 27న‌) మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి.. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి.. బోడ జ‌నార్ద‌న్ తో పాటు వంద‌లాదిగా బీజేపీలోకి చేర‌నున్న‌ట్లు జితేంద‌ర్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ అవ‌మానాల‌తో విసిగిపోయిన ప‌లువురు గులాబీ నేత‌లు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వ్యాఖ్యానించ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. అంతేకాదు.. మ‌రికొద్ది రోజుల్లో బీజేపీ కీల‌క బాధ్య‌త‌లు జితేంద‌ర్ రెడ్డికి అప్ప‌గించే అవ‌కాశం ఉందంటున్నారు. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు వీలుగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.

అధికార టీఆర్ ఎస్ కు చెందిన ప‌లువురు నేత‌ల‌తో పాటు.. కాంగ్రెస్‌.. టీడీపీ నేత‌ల్ని పార్టీలోకి వ‌చ్చేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. మెద‌క్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్లోళ్ల శ‌శిధ‌ర్ రెడ్డి త‌దిత‌ర నేత‌లు బీజేపీలో చేర‌నున్నారు. టీడీపీకి చెందిన నేత‌లు సైతం బీజేపీలో చేరేందుకు రెఢీ అయ్యారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు గ‌రిక‌పాటి మోహ‌న్ రావు ఆధ్వ‌ర్యంలో ప‌లువురు రాష్ట్ర.. జిల్లా స్థాయి నేత‌ల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కు చెందిన ప‌లువురు నేత‌లు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధం కానున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో బీజేపీ కొ్త వెర్ష‌న్ 2.0 చూస్తారంటూ కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.