Begin typing your search above and press return to search.

చ‌దువుకోవాల‌ని ఉందంటే...చంపేశారు

By:  Tupaki Desk   |   9 Oct 2015 1:37 PM GMT
చ‌దువుకోవాల‌ని ఉందంటే...చంపేశారు
X
మార్పు కోసం ప్ర‌య‌త్నించేవారు స‌మాజంలో ఉండి ఆ దిశ‌గా అడుగులువేయాలి లేదంటే ఆ స‌మాజానికే ముప్పుగా మారుతారు. అభివృద్ధి కోణంలో స‌మాజం ముందుకు సాగుతుంటే స్వ‌ప‌రిపాల‌న పేరుతో అరాచ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ స‌మ‌స్య‌గా మారుతున్న మావోయిస్టులు తాజాగా ఈ ఘ‌ట‌న‌కు తెర‌తీశారు. చ‌దువుకోవాల‌ని ఆస‌క్తి చూపిన ఓ బాలిక‌ను అకార‌ణంగా చంపేశారు. ఆమెతో పాటు కుటుంబ స‌భ్యుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌న‌దేశంలోనే జ‌ర‌గ‌డం హృద‌యం విదార‌కరం.

జార్ఖండ్ లోని గుమ్లాకు చెందిన సంగీత కుమారి త‌న ఇంటి పక్కన ఉండే మావోయిస్టు నేత సవిత ద్వారా న‌క్స‌లిజం సిద్దాంతాల ప‌ట్ల ఆక‌ర్షితురాల‌యింది. దీంతో బాల్యదశలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. చిన్న వ‌య‌సు కావ‌డంతో ఆమెకు మొద‌ట్లో ద‌ళానికి సంబంధించిన ప‌నులేమీ చెప్ప‌లేదు దీంతో వంట చేయడం వంటి స‌హాయాలు చేసేది. కాల‌క్రమంలో ఆమె ద‌ళంలో స‌భ్యురాలిగా మారి షార్ప్ షూటర్ గా ఎదిగింది. ఈ క్ర‌మంలో పోలీసులు, కేంద్ర బ‌ల‌గాల కూంబింగ్‌ ల‌తో మావోయిస్టుగా ఆమె చాలాకష్టాలను అనుభవించింది. ఆ రాష్ర్టంలోని లాతేహార్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది కూడా. ఈ క్ర‌మంలోనే ఓ ద‌ళ స‌భ్యుడిని ప్రేమించింది. అయితే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందామనేలోపు ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. దాంతో సంగీత ద‌ళం జీవితం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకుంది. బయటకు వచ్చి చదువుకుని మంచి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణ‌యించుకొని అక్క‌డినుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందుకోసం ద‌ట్ట‌మైన అడ‌వుల నుంచి నాలుగు రోజులు అవిశ్రాంతంగా నడిచి స్థానికంగా ఉన్న‌ గుల్మా అనే ప్రాంతానికి చేరుకుని అక్కడ రహస్యంగా తలదాచుకుంది.

అయితే మావోయిస్టులు సంగీత ద‌ళం నుంచి బ‌య‌టకు వెళ్లిపోయింద‌నే వివరాలు తెలుసుకొని...చంపేస్తామని బెదిరించారు. అయితే ఆ బెదిరింపులకు త‌లొగ్గకుండా సంగీత‌ స్కూల్లో చేరింది. ఈ క్ర‌మంలో ఏనాడో వ‌దిలివెళ్లిన త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకునేందుకు సొంతూరు సిబిల్‌ కు వెళ్లింది. అయితే సంగీత సొంతూరుకు వెళ్లేలోగానే మావోయిస్టు అగ్ర‌నేతలు ఆమె కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. ద‌ళం నుంచి వ‌చ్చి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారిన సంగీతను కూడా చంపేస్తామని బెదిరింపు లేఖ రాసిపెట్టారు. అయితే తాజాగా సంగీత కూడా చ‌నిపోయి శవమై తేలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

హింసను వదిలిబడిబాట పట్టిన స‌మ‌యంలో సంగీత మీడియాతో తన జీవిత అనుభవాలను పంచుకుంది. మావోయిస్టులగా త‌ను చూసిన లోకాన్ని వివ‌రించింది. మావోదళాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దోపిడీ, బలవంతపు అబార్షన్లు త‌ర‌చుగా జ‌రుగుతుంటాయ‌ని వాపోయింది. అలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం వ‌ల్ల తాను ద‌ళంవైపు వెళ్లాన‌ని...అయితే వాస్త‌వం బోధ‌ప‌డినందున మ‌ళ్లీ హింసాత్మక ఉద్యమాల వైపు వెళ్లనని చెప్పింది. ఆ అనుభ‌వాల స‌మ‌యంలోనే త‌న‌ను మావో అగ్ర‌నేత‌లు బ‌త‌క‌నివ్వ‌ర‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. అనుకున్న‌ట్లే...ఆమె భ‌యం నిజ‌మై అసువులు బాసింది.

20 ఏళ్ల ప్రాయంలోనే బాల్యంతో పాటు న‌ర‌క‌కూప‌మైన అర‌ణ్య జీవితాన్ని అనుభ‌వించిన సంగీత...ఆమె క‌ల‌ల జీవిత‌మైన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుంటే పాకిస్తాన్ నుంచి పాపుల‌ర్ అయిన మ‌లాల లాగా మ‌న‌దేశంలోనూ ఓ ఆద‌ర్శ‌వంత‌మైన బాలిక‌గా నిలిచేదేమో.