విమానాలు ఇలా కూడా ల్యాండవుతాయా?

Wed Sep 13 2017 13:37:48 GMT+0530 (IST)

ఇటీవల కాలంలో విమానాల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు - సిబ్బంది పొరపాట్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనతో 90 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాల్సి వచ్చింది. దాచావు చివరి అంచు వరకూ వెళ్లిన వారు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. బతుకుజీవుడా అనుకుంటూ కనిపించని దేవుడిని ప్రార్థించారు. వివరాల్లోకి వెళితే గువాహటి నుంచి జోర్హాట్ కు బయలుదేరిన ఓ జెట్ లైట్ విమానం ల్యాండ్ అవుతుండగా ట్యాక్సీ వేలోకి దూసుకెళ్లి దిగబడింది. ఆ సమయంలో విమానంలో 90మంది ప్రయాణికులున్నారు.బెంగళూరుకు చెందిన ఈ విమానం గువాహటి మీదుగా జోర్హాట్ కు వెళ్లినట్లు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. విమానంలోని ఒక వీల్ కాస్త మట్టిలోకి దిగిపోవడంతో అక్కడే విమానం ఆపేసి ప్రయాణీకులను సురక్షితంగా తరలించారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో ప్రయాణీకులు అంతా సురక్షితమే అంటూ జెట్ ఎయిర్ వేస్ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఈ వ్యవహారాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పరిశీలించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ఈ ఘటనను జాగ్రత్తగా దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే  ఈ ఘటన సాంకేతిక వైఫల్యం కారణంగా జరిగిందా సిబ్బంది నిర్లక్ష్యమా అనేది తెలియరాలేదు. ఏది ఏమైనా ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని చర్యలు చేపట్టాలనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.