Begin typing your search above and press return to search.

జీవిత చేరినా... పదవులివ్వరట

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:30 PM GMT
జీవిత చేరినా... పదవులివ్వరట
X
సినీనటి జీవిత రాజకీయాలపట్ల ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతున్నారు. సినీనట విరమణానంతరం రాజకీయాల్లో రాణించాలన్న తపన ఆమెలో కన్పిస్తోంది. సమాజంలో హుందాగా జీవితాన్ని గడిపేందుకు రాజకీయాల అండ అవసరమనే భావన జీవితారాజశేఖర్ లో పుష్కలంగా ఉంది. సందర్భోచితంగా రాజకీయ పార్టీలు మారుతారనే ముద్రపడినా... దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలనే విధంగా జీవిత ప్రయత్నిస్తున్నారు. వెండి తెరపై ఆదరించిన ప్రేక్షకలోకం రాజకీయాల్లోనూ ఆశీర్వదిస్తారని ఆమె విశ్వసిస్తున్నారు. ప్రజాజీవితంలో సినీనటి జీవిత రాజకీయ జీవితాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక ప్రయత్నాలు బెడిసికొట్టిన నేపథ్యంలో తాజాగా తెదేపా వైపు ఆమె చూపు సారిస్తోందిట. అక్కడ ఉన్న మహిళ నాయకురాళ్ల కొరత తనకు కలిసి వస్తుందని ఆశలు పెంచుకుంటోందిట.

సినీనటి జీవిత తెలుగుదేశంపార్టీలో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఇటీవల నంది అవార్డుల ప్రకటనలో జీవిత అత్యంత ఉత్సాహం కనబరచారు. ఎన్నడూలేని విధంగా సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవడం, సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం కోరడం తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడి దృష్టిలో పడేందుకు జీవిత చురుగ్గా వ్యవహరించినట్లు కన్పించారు. తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తామనే సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడవేగ’ సినిమాకు మంచి టాక్ లభించిన నేపథ్యంలో పరిస్థితులను అనుకూలంగా మలచుకునేందుకు జీవిత ప్రయత్నిస్తున్నారు. నంది అవార్డుల ప్రకటనలో హడావుడితోపాటు తాజాగా ముఖ్యమంత్రికి గరుడవేగా సినిమా చూపించాలనే తాపత్రయం ఆమెలో కన్పిస్తోంది.

జీవితారాజశేఖర్ ప్రజాజీవితంలోకి రావాలనే ఉత్సాహం మంచిదే గానీ... తెలుగుదేశంపార్టీలో చేర్పించుకున్నప్పటికీ ఎలాంటి పదవులిచ్చేది లేదనే సంకేతాలున్నాయి. సినీ రంగం నుంచి వచ్చే వారిని కార్యకర్తల్లా వాడుకోవాలనే ఉద్ధేశంతో పార్టీ వర్గాలున్నట్లు సమాచారం. అయితే జీవిత తెలుగుదేశంపార్టీలో చేరితే ఎలాంటి పదవులపై ఆశలు పెట్టుకోకుండా పార్టీ పటిష్టతకు కృషిచేయాల్సి ఉంటుంది.