Begin typing your search above and press return to search.

ఉగ్రదాడికి భారీ ప్లానింగ్ జరుగుతుందా?

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:46 AM GMT
ఉగ్రదాడికి భారీ ప్లానింగ్ జరుగుతుందా?
X
ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత నుంచి పాకిస్తాన్ కు పెరుగుతున్న అసహనం అంతా ఇంతా కాదు. కశ్మీర్ ను బూచిగా చూపిస్తూ ఇంతకాలం సాగిన ఆటలు.. ఆర్టికల్ 370 నిర్వీర్యంతో సాధ్యం కాకపోవటం ఒక కారణంగా చెప్పాలి. దీనికి తోడు.. అంతర్జాతీయంగా భారత్ ను బద్నాం చేసే ప్రోగ్రాంలో అడ్డంగా ఫెయిల్ కావటంతో భారత్ లో ఉగ్రకార్యకలాపాలకు పాక్ పరోక్షంగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధపడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అనుమానాలకు బలం చేకూరేలా తాజాగా కొన్ని ఆధారాలు భద్రతాదళాలకు లభించినట్లుగా తెలుస్తోంది. దేశంలో భారీ ఎత్తున ఉగ్రదాడి జరిపేందుకు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కశ్మీర్ లో జైషే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. పాక్ లోని బాలాకోట్ లో ఇప్పటికే ఉగ్రకార్యకలాపాలు మొదలు కావటమే కాదు.. ఈసారి 40 నుంచి 50 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లుగా హోంశాఖకు సమాచారం అందించింది.

ఈసారి ఉగ్రదాడికి పంపే ఉగ్రవాదుల్లో సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. భారత్ లో రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లానింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాజా ఉగ్రదాడుల లక్ష్యం ఆర్టికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో కశ్మీర్ లో హింస చెలరేగిందన్న భావన కలిగించేందుకేనని చెబుతున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో మొన్నటి వరకూ ఉన్న ఆంక్షలు ఇప్పుడిప్పుడు సడలిస్తున్న వేళ.. సాధారణ పరిస్థితులు చోటు చేసుకున్న భావన అంతర్జాతీయ సమాజానికి కలుగకుండా ఉండేందుకు వీలుగా ఉగ్రదాడికి ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవటానికి సైన్యం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు కశ్మీర్ లోని ఉత్తర భాగం నుంచి దాదాపు 500 మంది ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపాలన్నది తాజా ప్లానింగ్ గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి.