అండర్ వేర్ కామెంట్స్.. జయప్రదపై దుమారం

Mon Apr 15 2019 10:47:55 GMT+0530 (IST)

జయప్రద అజాంఖాన్.. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తరుఫున నాయకులుగా చెలామణీ అయిన నేతలు. అప్పుడు ఒకరినొకరు సహకరించుకొని గెలిచారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు చేయిదాటాయి. జయప్రదపై అజాంఖాన్ తీవ్ర మైన విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగత లైంగిక విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఇద్దరికీ ఇప్పటికీ పడడం లేదు.తదనంతర పరిణామాల్లో సమాజ్ వాదీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ 2019 ఎన్నికల వేళ లాబీయింగ్ చేసి బీజేపీలో చేరారు. ఎలాగోలా యూపీలోని ఆమె ఇదివరకు గెలిచిన రాంపూర్ పార్లమెంట్ సంపాదించారు. ఇప్పుడు రాంపూర్ నుంచి బీజేపీ  అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే ఈమెకు ప్రత్యర్థి మరెవరో కాదు.. ఒకప్పటి ఆమె మిత్రుడు.. ఇప్పుడు ఆగర్భశత్రువు అయిన అజాంఖానే.. సమాజ్ వాదీ నుంచి రాంపూర్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో జయప్రద వాపోయారు. తనపై అజాంఖాన్ దాడి హెచ్చరిక చేశారని.. యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద కన్నీరుమున్నీరైంది.

ఈ వ్యాఖ్యలపై అజాంఖాన్ తీవ్రంగా స్పందించారు. దారుణంగా మాట్లాడారు.. జయప్రదను రాంపూర్ లో గతంలో ఎంపీని చేసింది తానేనని.. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేదని దారుణ సెక్సీ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఒక మహిళా రాజకీయ నేత పట్ల ఇంత సెక్సీ ఆరోపణలు చేయడంపై అందరూ అజాంఖాన్ పై దుమ్మెత్తి పోశారు. అంతేకాదు.. ‘ఆమె గొప్ప నాట్యగత్తె.. ఆమెను పదిహేడు సంవత్సరాల పాటు ఎవరూ టచ్ చేయకుండా నేనే కాపాడా’ అంటూ అజాంఖాన్ వ్యాఖ్యానించడంపై మరింత వివాదాస్పదమైంది.