Begin typing your search above and press return to search.

‘అమ్మ’ వరాలు వింటే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే..

By:  Tupaki Desk   |   5 May 2016 4:22 PM GMT
‘అమ్మ’ వరాలు వింటే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే..
X
ఎన్నికల వేళ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి రాజకీయ పార్టీలు వరాల జల్లు కురిపించటం మామూలే. సంక్షే కార్యక్రమాలతో పాటు.. వర్గాల వారీగా తాయిలాల ఆశ చూపించి ఓట్లను దండుకోవటం మామూలే. అయితే.. ఈ తంతును పీక్ లెవెల్స్ కు తీసుకెళ్లేలా చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే అధినేత్రి.. అమ్మగా సుపరిచితురాలైన జయలలిత. తాజాగా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్ని పురస్కరించుకొని ఓటర్ల మనసు దోచుకునేందుకు అమ్మ ప్రకటించిన ఎన్నిక మేనిఫెస్టో వివరాలు వింటే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. తమిళనాడులో ఓటర్ని ఎందుకు కాలేదని ఫీల్ కావాల్సిందే.

ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు ప్రకటించిన హామీలను తలదన్నేలా అమ్మ ప్రకటించిన ఎన్నికల తాయిలల్లోకి ఒక లుక్కేస్తే.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించేది హామీ.. తమిళనాడు రాష్ట్రంలోని మహిళలు స్కూటర్లు కొనుగోలు చేస్తే.. కొనుగోలు ధరలో 50 శాతం రాయితీ కల్పించే సౌకర్యం. అంటే.. రూ.60వేల బైకు.. కేవలం రూ.30వేలకే చేతికి రానుందన్న మాట. అంతేకాదు.. ప్రతి రెండు నెలలకు వంద యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తానన్న వరంతో పాటు.. సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.500 విలువ చేసే కూపన్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. గర్భిణుల ప్రసూతి సాయాన్ని రూ.18వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

అంతేకాదు.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత మొబైల్ ఫోన్ తోపాటు.. ఉచిత సెట్ అప్ బాక్సులు.. పదో తరగతి.. ప్లస్ టు (ఇంటర్) విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లతో పాటు.. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటం.. అమ్మ బ్యాంకింగ్ కార్డు ఇవ్వటం.. రైతులకు రుణమాఫీ లాంటివెన్నో ఆఫర్లను ఆమె వెల్లడించారు. కోతల్లేని నిరంతర విద్యుత్.. వివిధ గృహనిర్మాణ పథకాల కింద 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి హామీ ఇస్తూ ఎన్నికల హామీ పత్రంలో ప్రకటించారు. ఐదేళ్లు నాన్ స్టాప్ గా అధికారంలో ఉన్న అమ్మ.. కోతల్లేని విద్యుత్ ఎందుకు సరఫరా చేయలేకపోయారు? ఇప్పుడు లేని అధికారం రేపొద్దున వస్తే కోతలు ఉన్నట్లుండి ఎలా మాయమవుతాయి?

ఇన్ని హామీలు ఇస్తున్న అమ్మ.. భారీ వర్షాలు కురిస్తే.. నాలుగైదు రోజుల పాటు చెన్నై మహా నగరం అస్తవ్యస్తం కాకుండా చేస్తానని.. తిండి తిప్పలు లేకుండా వేలాది మంది నిరాశ్రయలు కాకుండా చూస్తామని.. కళ్లు చెదిరిపోయే భవనాల్లో బతుకుతున్న వారు సైతం ప్రకృతి విపత్తు సమయంలో గుక్కెడు నీళ్ల కోసం తహతహలాడకుండా చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారు చెప్మా..?