Begin typing your search above and press return to search.

సొంత నేత‌ల‌కే చుక్క‌లు చూపిస్తున్న అమ్మ

By:  Tupaki Desk   |   2 May 2016 4:34 PM GMT
సొంత నేత‌ల‌కే చుక్క‌లు చూపిస్తున్న అమ్మ
X
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంటే పార్టీ అనుయాయులకు ఎందుకంత భయభక్తులో చెప్ప‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా నామినేషన్ల దాఖ‌లు చేసే వ‌ర‌కు ఖరారైన అభ్యర్థులను ఏ క్షణంలోనైనా మార్చడానికి అనువుగా రంగం సిద్ధం చేసుకుని రాజకీయాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. దూరదృష్టితో వ్యూహాత్మకంగా అధినేత్రి వేసిన అడుగులను తలచుకుని పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి.

త‌మిళ‌నాడు శాసనసభ ఎన్నికలకు 227 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత వెనువెంటనే పలువురు అభ్యర్థులను మార్చివేసిన విషయం తెలిసిందే. ఈ మార్పులు కొనసాగడంతో నామినేషన్‌ ప్రక్రియ వరకు ‘అమ్మ’ చర్యలు తమ వరకు రాకూడదని పలువురు కోరుకున్నారు. నామినేషన్ల ఘట్టానికి ముందు కొంతమంది అభ్యర్థులను దురదృష్టం వెంటాడటంతో పార్టీ టికెట్‌ను కోల్పోగా మిగిలిన అభ్యర్థులు మాత్రం గండం గడిచినట్లు భావించారు. అయితే నామినేషన్ల ప్రక్రియకు తెరపడినప్పటికీ ప్రస్తుతం అభ్యర్థులు గుండెదడకు గురవుతున్నారు. ‘అమ్మ’ సూచించిన వారే డమ్మీ అభ్యర్థులుగా రంగంలో ఉండటమే అందుకు ప్రధాన కారణం!

అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేటప్పుడు తన కుటుంబ సభ్యుల్లో ఒకరిచేత డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. అనివార్య కారణాల వల్ల తాను పోటీ చేయలేకపోతే డమ్మీ అభ్యర్థిగా ఉన్న కుటుంబ సభ్యులు ప్రధాన అభ్యర్థులకు పోటీచేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం అందుకు ‘అమ్మ’ అడ్డుకట్ట వేశారు. తాను సూచించే వ్యక్తులనే డమ్మీ అభ్యర్థులుగా రంగంలో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఆఖరి క్షణంలో అభ్యర్థి పార్టీ ఫిరాయించినా డమ్మీ అభ్యర్థిని దక్కించుకోవడానికి అధిష్ఠానం ఇలా ఆలోచించిందని అంతా భావించారు. అయితే అసలు విషయం తెలిసి ఔరా అనుకున్నారు.

దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లా - యూనియన్‌ - పట్టణ కార్యదర్శులను డమ్మీ అభ్యర్థులుగా అధిష్ఠానం వ్యూహాత్మకంగా రంగంలోకి దించింది. వాస్తవానికి వీరంతా అధినేత్రి ‘రెండో జాబితా’లోని అభ్యర్థులుగా వినికిడి. అభ్యర్థులను తొలగించిన ప్రతిసారీ రెండో జాబితాలోని అభ్యర్థులనే అమ్మ ప్రకటించారని సమాచారం. నామినేషన్ల పరిశీలన ఘట్టం వరకు రెండో జాబితాను పరిశీలనలో ఉంచాలని అధినేత్రి భావించారని, అందుకే రెండో జాబితాలోని వారినే డమ్మీ అభ్యర్థులుగా వ్యూహాత్మకంగా రంగంలోకి దించారని భోగట్టా. ఒకవేళ అభ్యర్థులను మార్చాల్సి వస్తే వారి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశించి తద్వారా డమ్మీ అభ్యర్థిని రంగంలో కొనసాగించాలన్నది జ‌య వ్యూహమ‌ని చెప్తున్నారు. డమ్మీలుగా బలమైన నిర్వాహకులనే రంగంలోకి దించడం ఇందుకు నిదర్శనం. సైదాపేట అభ్య‌ర్థిగా పొన్నైయన్ అనే నేత బరిలో ఉండగా ఆయనకు డమ్మీగా మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సెంతమిళన్‌ను, టీనగర్‌ అభ్యర్థి సత్యకు డమ్మీగా మేయర్‌ సైదై దురైస్వామిని, ఆలందూర్‌ అభ్యర్థి బన్రుట్టి రామచంద్రన్‌కు డమ్మీగా ఎమ్మెల్యే వెంకటరామన్‌ను బరిలోకి దించారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లోనూ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నిర్వాహకులనే డమ్మీలుగా రంగంలోకి దించారు. దూరదృష్టితో అధినేత్రి పావులు కదపడం తలచుకుని అభ్యర్థులు నివ్వెరపోతున్నారు.