Begin typing your search above and press return to search.

పోయిస్ గార్డెన్ లో ఐసీయూ?

By:  Tupaki Desk   |   27 Oct 2016 10:43 AM GMT
పోయిస్ గార్డెన్ లో ఐసీయూ?
X
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ఉన్న అమ్మ మరో పది రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లుగా చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అమ్మ ఆరోగ్యం కుదుటపడనప్పటికీ.. ప్రస్తుతం ఆమె పనులు ఆమె చేసుకునే వరకూ వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆమె పూర్తిస్థాయిలో కోలుకోవటానికి దాదాపు మూడు నాలుగు నెలలకు పైనే పడుతుందని.. ఆర్నెల్లు పట్టినా ఆశ్చర్యం లేదన్నది వైద్యుల మాటగా చెబుతున్నారు. వీలైనంత వరకూ ఒత్తిడికి దూరంగా ఉంటూ.. పూర్తి విశ్రాంతి తీసుకోవటం.. వైద్యుల పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరిగా చెబుతున్నారు.

ఈ దీపావళికి అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలన్న పట్టుదలతో ఉన్న అమ్మను.. లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే గట్టిగా చెప్పటంతో ఆమె ఊరుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవాలని అమ్మ భావిస్తున్నా.. అది ఆమెకే నష్టమన్న విషయాన్ని అర్థమయ్యేలా వైద్యులు చెప్పటంతో ఆమె ఊరుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమ్మ కోసం ఆమె నివాసమైన పోయిస్ గార్డెన్ లో ప్రత్యేకంగా ఒక గదిని ఐసీయూగా మార్చినట్లు తెలుస్తోంది. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణతోపాటు.. అధునాతన ఐసీయూ సౌకర్యాలుండేలా ఈ గదిని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

దీర్ఘకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో అమ్మ ఉండాల్సిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోయిస్ గార్డెన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసీయూ ఏర్పాట్ల కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లుగా సమాచారం. మరోవైపు.. అమ్మ ఆరోగ్యం కుదుట పడిన వెంటనే.. సింగపూర్ కానీ అమెరికాకు కానీ వెళ్లి మరింత మెరుగైన వైద్యం చేయించుకోవాలన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/