Begin typing your search above and press return to search.

హెల్త్ బులెటిన్... అమ్మ మాట్లాడుతున్నారు!

By:  Tupaki Desk   |   21 Oct 2016 3:20 PM GMT
హెల్త్ బులెటిన్... అమ్మ మాట్లాడుతున్నారు!
X
గత నెలరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబందించిన హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. ఈ హెల్త్ బులెటిన్ ద్వారా అమ్మ అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. "జయలలిత మాట్లాడుతున్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు" అని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత తాజాగా మరోసారి ఆమె హెల్త్ బులెటిన్‌ను వైద్యులు వెల్లడించారు. ఈ హెల్త్ బులెటిన్ లో... జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉండాలని తెలిపారు.

అయితే ఈ విషయాలను ఇప్పటికే అనాడీఎంకే నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అపోలో వైద్యులు కూడా తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తే అభిమానులకు మరింత ఉపశమనంగా ఉంటుందని పలువురు భావించారు. అనుకున్నట్లుగానే శుక్రవారం సాయంత్రం అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కాగా, లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే తో పాటు ఎయింస్, అపోలో వైద్యులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుతోన్నారు.

అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో "అమ్మ కూర్చున్నారని, మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని" అన్నాడీఎంకే పార్టీ వర్గాలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో మరికొంతకాలం తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరపడుతున్నారు. అయితే ఇంతకాలం ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాశారు. అయితే తాజా సమాచారం ప్రకారం తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడుతున్నారని తెలుస్తోంది.