Begin typing your search above and press return to search.

ఓర్నీ.. పెళ్లి బాషికాల్లోనూ అమ్మేనంట

By:  Tupaki Desk   |   6 Feb 2016 2:08 PM GMT
ఓర్నీ.. పెళ్లి బాషికాల్లోనూ అమ్మేనంట
X
అమ్మంటే అమ్మే. అమ్మ అనుకుంటే ఏమైనా జరిగిపోవాల్సిందే. దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులున్నా సంక్షేమ పథకాలకు బ్రాండింగ్ చేసిన ఘనత మాత్రం అమ్మదే. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన విలక్షణమైన బ్రాండింగ్ తో ఇప్పటికే తమిళుల మనసు దోచుకున్నారు. ఎక్కడ చూసినా అమ్మ కనింపించేలా చేసిన ఆమె.. ఒక్క విషయంలోనే తప్పటడుగు వేశారు. ఆ మధ్య తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాల సమయంలో బాధితులుగా మారిన లక్షలాది మందికి సాయం అందించేందుకు పంపిణీ చేసిన ప్రతి వస్తువులోనూ అమ్మ బొమ్మ ఉండేలా జాగ్రత్త తీసుకోవటం.. అన్నాడీఎంకే కార్యకర్తల అత్యుత్సాహం కలగలిపి సగటు తమిళుడికి ఒళ్లు మండిపోయేలా చేసింది.

అప్పటివరకూ అమ్మ బ్రాండ్ మీద ప్రతి చోటా కనిపించే క్యాంటిన్లు.. సిమెంట్.. మెడికల్ షాపులు.. వాటర్ బాటిల్స్.. టీ.. స్కూల్ బ్యాగ్స్.. ఆహార పదార్థాలు.. ఇలా అన్నింటిలోనూ అమ్మ ఉన్నట్లే.. అమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన పెళ్లిళ్లలను బ్రాండింగ్ మిస్ కాకుండా చూడటం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 24న జయలలిత 68వ పుట్టినరోజు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద జంటలకు పెళ్లిళ్లు చేయటం మొదలైంది. దీనికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు.. పెళ్లిళ్లలో అమ్మ బ్రాండింగ్ మిస్ కాకుండా చూసేందుకు వినూత్నంగా ఆలోచించారు. పెళ్లికూతురు.. పెళ్లి కొడుకు నెత్తికి కట్టే బాషికంలో అమ్మ బొమ్మ భారీగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

తాను నిర్వహించే సామూహిక పెళ్లిళ్లకు హాజరవుతున్న అమ్మ.. బ్రాండింగ్ విషయంలో మాత్రం ఇంచ్ కూడా తగ్గటం లేదు. దీంతో.. అమ్మ చేస్తున్న పెళ్లిళ్ల కంటే ప్రచారం మీద చూపిస్తున్న ఫోకస్ విమర్శలకు గురి అవుతోంది. అతి ‘అమ్మ’ చేసినా అతే కదా.