విషయం ఏదైనా మోడీకి బాసటగా ఆమె

Thu Jan 12 2017 14:38:07 GMT+0530 (IST)

అప్పుడెప్పుడో చాలా చిన్న వయసులో జరిగిన పెళ్లి.. ఆ తర్వాత విడిగా ఉంటూ.. ఎవరికి వారు వారి జీవితాల్లో బిజీగా ఉండటం.. కట్ చేస్తే.. అలా విడిపోయిన ఆ ఇద్దరు దేశ వ్యాప్తంగా వార్తల్లోకి రావటం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అందులోకి దేశానికి ప్రధానిగా అయిన వ్యక్తి విషయంలో జరగటం చాలా చాలా తక్కువనే చెప్పాలి.

మోడీ అవివాహితుడని.. ఆయనకు పెళ్లి కాలేదని నమ్మేవారు. అయితే.. ఆయనకు పెళ్లి అయ్యిందని.. భార్యతో విడిపోయి విడిగా ఉంటున్నారన్నవిషయం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చింది. అయితే..ఈ ఇష్యూను బయటకు తీసుకొచ్చిన ప్రత్యర్థి రాజకీయపక్షాలు ఆశించినంత నష్టమేమీ మోడీకి జరగకపోవటానికి కారణం ఆయన సతీమణి జశోదాబెన్ అని చెప్పాలి.

అధికారికంగా విడాకులు తీసుకోకున్నా.. తన ఎన్నికల అఫిడవిట్లో తన భార్యగా జశోదాబెన్ ను మోడీ పేర్కొన్నా.. ఎలాంటి రచ్చ చేయకుండా హుందాగా ఉండటం ఆమె గొప్పతనమని చెప్పక తప్పదు. నిజానిక ఆమె స్థానంలో ఉన్న వారు అరిచి గీపెట్టి.. కాస్తంత హడావుడి చేస్తే మోడీకి జరిగే డ్యామేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జశోదాబెన్ గురించి ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి ప్రస్తావన తీసుకురాని తీరు మోడీలో కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా ఆమె వ్యవహారం ఉంటుంది. తాజాగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని జరిగిన ఒక  ప్రైవేటు స్కూల్ స్వర్ణోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోడీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతించటం.. వాటికి అనుకూలంగా మాట్లాడే జశోదాబెన్..  తాజాగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. నల్లధనాన్ని వెలికి తీయటానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొనటం ఈ మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికే చెల్లుతుంది. తన గురించి పట్టించుకున్నారా? లేదా? అన్న విషయాన్ని వదిలేసి.. మోడీ తీసుకున్న ప్రతి విషయానికి తన మద్దుతు ఉంటుందన్నట్లుగా వ్యవహరించే ఆమె తీరు కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/