Begin typing your search above and press return to search.

టీ 'లోక‌ల్' పోరులో జ‌న‌సేన‌!... పీకే ఓకేనేనా?

By:  Tupaki Desk   |   20 April 2019 7:04 AM GMT
టీ లోక‌ల్ పోరులో జ‌న‌సేన‌!... పీకే ఓకేనేనా?
X
ప్ర‌ముఖ సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్... ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దిగ్విజ‌యంగా ముగించుకున్నారు. ఆ వెంట‌నే ఇప్పుడు షెడ్యూల్ ప్ర‌క‌టించేసిన తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసే దిశ‌గా ఆయ‌న కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మొన్నటి ఎన్నిక‌ల్లో సాంతం ఏపీపైనే దృష్టి సారించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో తెలంగాణ‌లోని ఓ ఏడు ఎంపీ సీట్ల‌లోనూ పోటీ చేశామ‌నిపించారు. తెలంగాణ‌లో పోటీకి అంత‌గా ఆస‌క్తి చూప‌ని ప‌వ‌న్‌... ఏపీ ఎన్నిక‌ల‌పైనే త‌న దృష్టి మొత్తాన్ని కేంద్రీక‌రించారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఒక్క‌సారిగా కామ్ అయిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇప్పుడు పార్టీకి చెందిన తెలంగాణ నేత‌ల‌తో సుదీర్ఘ మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఓ నాలుగు నెల‌ల క్రితం అసెంబ్లీ - మొన్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ముగించుకున్న తెలంగాణ ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోయింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగియ‌గానే... లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌పై దృష్టి సారించిన టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఎన్నిక‌ల‌కు శంఖం పూరించేశారు. అసెంబ్లీలో రికార్డు విక్ట‌రీని సాధించిన కేసీఆర్‌.... సార్వ‌త్రిక ఎన్నికల్లోనే క్లీన్ స్వీప్ చేసేస్తామ‌న్న ధీమాతో ఉన్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ స‌ర్కారు స‌న్న‌ద్ధ‌త‌ను ప‌రిశీలించిన తెలంగాణ ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌ కు షెడ్యూల్ ను ప్ర‌క‌టించేసింది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన నుంచి ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న వెలువ‌డేందుకు రంగం సిద్ధ‌మైపోయింద‌న్న వార్త‌లు మొద‌లైపోయాయి. జ‌న‌సేన తెలంగాణ ఇన్ చార్జీ శంక‌ర్ గౌడ్‌ - మ‌రో కీల‌క నేత మ‌హేంద‌ర్ రెడ్డి ఇటీవ‌లే ప‌వ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యార‌ట‌. ఈ భేటీలో వారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించార‌ట‌. ఈ ద‌ఫా తెలంగాణ లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ పార్టీ గుర్తుల మీదే జ‌రుగుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ద్వారా తెలంగాణ‌లోనూ పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశాలున్నాయ‌ని, పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని వారు సూచించార‌ట‌.

వారి స‌ల‌హాలు - సూచ‌న‌ల‌ను ఆస‌క్తిగానే విన్న ప‌వ‌న్‌... పోటీకి దాదాపుగా ప‌చ్చ జెండా ఊపేశార‌ట‌. అయితే ఈ ఎన్నిక‌ల్లో పోటీపై పార్టీ కీల‌క నేత‌లు - మేధావులు - పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యాల‌ను సేక‌రించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ట‌. అయినా పార్టీ అధినేత పోటీకి సిద్ధ‌ప‌డితే... పార్టీ కార్య‌కర్త‌లు మాత్రం ఎందుకు వ‌ద్దంటారు? ఈ క్ర‌మంలో తెలంగాణ లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ లోకి జ‌న‌సేన దిగిపోవ‌డం ఖాయ‌మేన‌ని, దీనికి ప‌వ‌న్ ఓకే అన‌డం మాత్రమే మిగిలి ఉంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో పార్టీ పోటీకి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన ప‌వ‌న్‌... పార్టీలో చ‌ర్చ త‌ర్వాత అందుకు అనుగుణంగానే కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ ద్వారా... ప‌వ‌న్ తెలంగాణ‌లోనూ కీల‌క నేత‌గా ఎదిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.