Begin typing your search above and press return to search.

పవన్ - జగన్.. మధ్యలో జనసేన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:51 AM GMT
పవన్ - జగన్.. మధ్యలో జనసేన ఎమ్మెల్యే
X
జనసేనాని పవన్ తీరు వేరు.. ఆయన బీజేపీ - టీడీపీ అనుకూల వాదేనని విమర్శలొచ్చాయి.. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఆ రెండు పార్టీల కూటమికి మద్దతిచ్చి వారిని అధికారంలోకి వచ్చేలా చేశారు. గెలుస్తుందనుకున్న వైసీపీని జనసేనతో దెబ్బకొట్టారు పవన్. కానీ బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. టీడీపీ కూడా మాటకు కట్టుబడలేదని.. 2019 ఎన్నికల వేళ సొంతంగా జనసేనతో పోరాడారు. అయితే పవన్ గత ప్రచారం మొత్తం చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది. అదే యాంటీ వైసీపీ విధానం..

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చూసిన వారందరికీ ఒక్కటే అనిపించింది.. అధికార టీడీపీని వదిలి ప్రతిపక్ష వైసీపీని జనసేనాని టార్గెట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. టీడీపీ-జనసేన తెరవెనుక బంధంపై అనుమానాలు కలిగాయి. వైఎస్ జగన్ పై పవన్ తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. జగన్ నీడనే గిట్టని విధంగా పవన్ వైఖరి తేటతెల్లమైంది.

కానీ 2019 ఎన్నికలు జనసేనాని పవన్ కు పీడకలను మిగిల్చాయి. ఆయన వ్యతిరేకించిన జగన్ నే జనాలు గెలిపించారు. జగన్ గెలిచారు.. సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తొలి అసెంబ్లీలోనే ప్రశంసలు అందుకున్నారు. అయితే అందరి నుంచి ప్రశంసలు రావడం ఒకెత్తు.. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక ప్రసాద్ వైఎస్ జగన్ పాలనపై - జగన్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రస్తావిస్తూ మరీ వీటిని అమలు చేయాలని కీర్తించడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరని.. అమ్మ ఒడి - రాజన్న బడి సహా ఎస్సీ - ఎస్టీ బీసీలకు ప్రాధాన్యమివ్వడంపై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు.మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమన్నారు.

ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. బీజేపీతో వైసీపీ స్నేహంగా ఉందని.. మిత్రపక్షం బీజేపీని ఒప్పించి హోదా సాధించాలని కోరడం రచ్చకు దారితీసింది..దీనిపై వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు పెట్టుకుందని.. బీజేపీతోనూ లాలూచీ పడిందని.. కానీ వైసీపీ ఏనాడు బీజేపీతో కలిసి పోటీచేయలేదని.. పొత్తు కూడా పెట్టుకోలేని సెటైర్ వేశారు.

ఇలా జనసేన ఎమ్మెల్యే జగన్ ను - వైసీపీ ప్రభుత్వాన్ని పొగడడం సంచలనంగా మారింది. జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న జగన్ ను జనసేన ఎమ్మెల్యే కీర్తించడంతో ఈయన జనసేనను వీడుతారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక మొన్నీ మధ్యనే జగన్ ను కలిసి అభినందనలు తెలిపాడట.. చర్చలు జరిపాడట.. చూస్తుంటే ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా పవన్ కు షాకిచ్చేటట్టే ఉన్నాడు.