Begin typing your search above and press return to search.

సానుభూతి చూప‌కుండా విమ‌ర్శ‌లేంది ప‌వ‌న్?

By:  Tupaki Desk   |   24 Sep 2018 10:31 AM GMT
సానుభూతి చూప‌కుండా విమ‌ర్శ‌లేంది ప‌వ‌న్?
X
అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - ఆయన ప్రధాన అనుచరుడు - మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం మావోయిస్టులు దారుణంగా కాల్పి చంపిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. మావోయిస్టులు మాటువేసి ఆ ఇద్దిరిని మ‌ట్టుపెట్టిన వైనం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించిన మావోయిస్టులు....50మంది బృందంతో ఆ ఇద్ద‌రిని హ‌త్య చేశారు. ఈ నేప‌థ్యంలో కిడారి - సోమ‌ల మృతికి అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి. మావోయిస్టుల దారుణ చ‌ర్య‌ను ముక్త‌కంఠంతో ఖండించాయి. మృతుల కుటుంబాల‌కు సంఘీభావం తెలుపుతూ సానుభూతిని ప్ర‌క‌టించాయి. అయితే, జ‌న‌సేన పార్టీ మాత్రం అందుకు భిన్నంగా....ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన టీడీపీ ప్ర‌భుత్వాన్ని నిందిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వారిద్ద‌రి మ‌ర‌ణానికి టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌ని జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ(పీఏసీ) ఆరోపిస్తూ ఒక అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. అక్ర‌మ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతూ చంద్ర‌బాబు స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకొని ఉంటే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌ని జ‌న‌సేన పీఏసీ అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే రెండు నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయ‌ని ఆరోపించింది. అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకొని ఉండాల్సింద‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప‌క్క మృతులకు అంద‌రూ సంఘీభావం తెలుపుతుంటే...ఈ స‌మ‌యంలో కూడా రాజ‌కీయాలు చేసేలా ఈ ప్ర‌క‌ట‌న ఏమిట‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. ఆ ఇద్దరి దారుణ హ‌త్య‌పై మ‌న్యం అంతా మండిప‌డుతోంటే జ‌న‌సేన మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఈ ప్ర‌క‌ట‌న ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.